Toxic gases leak: జైపూర్ కోచింగ్ సెంటర్‌లో విష వాయువుల కలకలం.. స్పృహతప్పిన విద్యార్థులు
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్‌లో విష వాయువుల కలకలం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి గోపాల్‌పూర్‌లోని ఈ కోచింగ్ సెంటర్‌లో హఠాత్తుగా పొగలు వ్యాపించడంతో విద్యార్థులలో ఆందోళన మొదలైంది. అప్పుడు సెంటర్‌లో సుమారు 350 మంది విద్యార్థులున్నారు. ఆ పొగల కారణంగా ఊపిరాడక 12 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. అందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండటంతో వారిని ఐసీయూలో చేర్పించారు. పొగలు ఎక్కడి నుంచి వ్యాపించాయనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రాథమిక విచారణలో, పొగలు కోచింగ్ సెంటర్ పక్కనే ఉన్న ఇంటి వంటగది నుంచి గ్యాస్ లీక్ కావడం వల్లా లేదా సమీపంలోని డ్రైనేజీ నుంచి విష వాయువులు బయటకు రావడంతో జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చర్యలు చేపట్టిన అధికారులు
సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్‌ను వెంటనే సీల్ చేశారు. అలాగే సమీపంలోని పేయింగ్ గెస్ట్ భవనాన్ని కూడా సీజ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఈ భవనాలను మూసివేయాలని జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ ఘటనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి కోచింగ్ సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.