Polavaram: వేగంగా సాగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులు.. వచ్చే ఖరీఫ్ సీజన్‌లోగా నీరందించేలా ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలనే లక్ష్యంతో చేపట్టిన పోలవరం ఎడమ కాలువ పనులు ఇప్పుడు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాన పోలవరం డ్యాం నిర్మాణం 2027 డిసెంబరులో పూర్తయ్యేలా ప్రణాళిక ఉన్నప్పటికీ, అందుకు ముందే 2026 ఖరీఫ్ సీజన్ నాటికి ఈ ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాలోని సుమారు 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా పని చేస్తున్నారు. ఇప్పటికే గోదావరిపై ఉన్న పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా వరద కాలంలో వచ్చే నీటిని ఉత్తరాంధ్ర భూములకు మళ్లించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కేవలం 9 నెలల వ్యవధిలోనే రూ.564 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది.
వివరాలు
రూ.282 కోట్ల బిల్లులు పెండింగ్‌లో..
ఇప్పటిదాకా రూ.261 కోట్ల బిల్లులు చెల్లించగా, మరో రూ.282 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నిధులు తక్షణమే విడుదల చేస్తే పనుల వేగం మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలన కాలంలో ఈ ఎడమ కాలువపై ఒక్క రూపాయి ఖర్చు కూడా జరగలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. కాలువ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూనే పనులు ముందుకు సాగుతున్నాయి. ఎత్తుగా ఉన్న కొండలను తవ్వడం, మార్గమధ్యంలో ఉన్న ఏలేరు కాలువతో పాటు పంపా, తాండవ, వరాహ వంటి చిన్న నదులను దాటించడం వంటి సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. వీటిని అధిగమించేందుకు అక్కడక్కడా సైఫన్లు, అక్విడక్టులు నిర్మిస్తున్నారు.
వివరాలు
వచ్చే వరద సీజన్ నాటికి గోదావరి జలాలు కాలువ చివరి వరకూ చేరాలనే లక్ష్యం
మరో ప్రధాన సమస్యగా, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పోలవరం ఎడమ కాలువ మార్గాన్ని అడ్డుకోవడం తో వంతెనల నిర్మాణానికి ట్రాఫిక్ మళ్లింపులు పెద్ద తలనొప్పిగా మారాయి. అయినప్పటికీ, వచ్చే వరద సీజన్ నాటికి గోదావరి జలాలు కాలువ చివరి వరకూ చేరాలనే లక్ష్యంతో యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు తరచూ సమీక్షలు నిర్వహిస్తుండగా, ప్రతి సోమవారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎస్‌ఈ ఏసుబాబు వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులను దగ్గరుండి నిర్వహిస్తున్నారు.
వివరాలు
మరో 10.850 కిలోమీటర్ల కొత్త కాలువ నిర్మాణం కూడా జరగాల్సి ఉంది
పోలవరం ఎడమ కాలువ పనులను మొత్తం 8ప్యాకేజీలుగా విభజించి అమలు చేస్తున్నారు. కొత్తగా 177.809 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం కొనసాగుతోంది. దీనితో పాటు ఏలేరు జలాశయం నుంచి ప్రస్తుతం విశాఖకు నీరు అందిస్తున్న కాలువను సుమారు 22 కిలోమీటర్ల మేర పోలవరం ప్రవాహ సామర్థ్యానికి అనుగుణంగా మార్పులు చేయనున్నారు. అదనంగా మరో 10.850 కిలోమీటర్ల కొత్త కాలువ నిర్మాణం కూడా జరగాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 4లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభించనుంది. ఇందులో కాకినాడ జిల్లాలో 1.67లక్షల ఎకరాలు,అనకాపల్లిలో 1.50లక్షల ఎకరాలు,తూర్పుగోదావరిలో 81 వేల ఎకరాలు, కోనసీమ జిల్లాలో 2 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం నగరంతో పాటు 560 గ్రామాలకు తాగునీరు అందించనున్నారు.
వివరాలు
వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎడమ కాలువ పనులు పూర్తిగా నిర్లక్ష్యం
పరిశ్రమల అవసరాలకు 23.44 టీఎంసీల నీటిని ప్రత్యేకంగా సరఫరా చేయనున్నారు. కాలువ చివరి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి గోదావరి వరద జలాలను మళ్లించి, ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటికీ నీరు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించి 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తొలి రెండు ప్యాకేజీల పనులు దాదాపు పూర్తయ్యాయి. అప్పట్లోనే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా గోదావరి వరద జలాలను ఏలేరు జలాశయానికి మళ్లించే వ్యవస్థను వేగంగా అమలు చేశారు. అయితే అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వ కాలంలో ఎడమ కాలువ పనులు పూర్తిగా నిర్లక్ష్యం పాలయ్యాయి.
వివరాలు
2025 జనవరిలో గుత్తేదారులకు పనులు
తాజాగా కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక, అనకాపల్లి జిల్లాలో 1.50లక్షల ఎకరాలకు వీలైనంత త్వరగా నీరు అందించాలనే లక్ష్యంతో మిగిలిన పనులకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్యాకేజీలు 1,3,5,5ఏ,6ఏ,8, 8ఏలో మిగిలిన పనుల వ్యయం అంచనా వేసి రూ.1,028కోట్ల విలువకు టెండర్లు పిలిచి, 2025 జనవరిలో గుత్తేదారులకు పనులు అప్పగించారు. ప్రత్యేకంగా ఐదో ప్యాకేజీలో ఏళ్ల తరబడి పనులు నిలిచిపోయాయి. కుమ్మరిలోవ గ్రామస్తులకు పునరావాస ప్యాకేజీపై అంగీకారం కుదరకపోవడంతో పనులు ఆగిపోయాయి. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, స్థానిక రెవెన్యూ అధికారులు గ్రామస్థులతో చర్చలు జరిపి ఒప్పించారు. గ్రామాన్ని ఖాళీ చేయించడమే ఒక పెద్ద పని కాగా,ఆ తర్వాత కొండలను తొలిచి కాలువ స్థాయికి తీసుకురావాల్సి వచ్చింది.
వివరాలు
87 మీటర్ల లోతు వరకు కొండల తవ్వకం
తొలుత కొండను తొలగించి, మరోవైపు కాలువ గట్టును బలంగా నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం దాదాపు 87 మీటర్ల లోతు వరకు కొండలను తవ్వాల్సి వచ్చింది. ఈ ప్యాకేజీలో మొత్తం 62 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు ఉండగా, ఇప్పటికే 47 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయి. సమీపంలో ప్రవహిస్తున్న తాండవ నదిపై అక్విడక్టు నిర్మాణం గతంలో కొంతవరకు జరిగితే, మిగిలిన పనులను ప్రస్తుతం వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్లిష్టమైన పనులన్నింటినీ కేవలం 10 నెలల వ్యవధిలో పట్టుదలతో ముందుకు తీసుకొచ్చారు.
వివరాలు
11 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి అనుగుణంగా పనులు
కాలువ మార్గంలో ఏలేరు కాలువ, పంపా, తాండవ, వరాహ నదులను దాటాల్సి ఉంటుంది. అందుకుగాను, ఏలేరు కాలువ వద్ద సైఫన్ నిర్మాణం,పంపా,తాండవ వద్ద అక్విడక్టుల నిర్మాణం కీలకంగా కొనసాగుతోంది. సైఫన్ ద్వారా ఏలేరు కాలువకు పై నుంచి నీరు సాగుతూనే ఉండగా, ఎడమ కాలువ నీరు కింద నుండి ప్రవహించే విధంగా రూపకల్పన చేశారు. ప్రస్తుతానికి 11 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి అనుగుణంగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి.పంపా నది వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం ఉండడంతో ఈ ఖరీఫ్ సీజన్ ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉండటంతో నవంబర్ చివరి తర్వాత పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వరాహ నదిపై అక్విడక్టు పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తి దశలో ఉన్నాయి.
వివరాలు
బెండపూడి వద్ద హైవేను మళ్లించేందుకు ఎడమ కాలువపై నిర్మిస్తున్న వంతెనలు
పోలవరం ఎడమ కాలువ మార్గంలో చెన్నై-కోల్‌కతా, కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారులను మొత్తం 9 ప్రాంతాల్లో దాటాల్సి ఉంది. అక్కడ వంతెనల నిర్మాణం పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని బెండపూడి వద్ద హైవేను మళ్లించేందుకు ఎడమ కాలువపై నిర్మిస్తున్న వంతెనలు. ఈ రోడ్డు నిత్యం రద్దీతో ఉంటుంది. తొలుత హైవేకు ఆనుకుని తాత్కాలిక వంతెనలు నిర్మించి ట్రాఫిక్‌ను మళ్లించి, ఆ తర్వాత ఆరు నెలల వ్యవధిలో శాశ్వత వంతెనలు పూర్తి చేయాలనే ప్రణాళిక అమలులో ఉంది. అయితే ట్రాఫిక్ మళ్లింపులకు సరైన అప్రోచ్ రోడ్లు లేకపోవడం, కొన్ని చోట్ల గ్రామాలు ఉండటం వంటివి జాతీయ రహదారుల సంస్థ అభ్యంతరాలకు కారణమవుతున్నాయి.
వివరాలు
ప్రస్తుత హైవేల కంటే ఎక్కువ ఎత్తులో వంతెనలు
దీంతో సమస్యలు పరిష్కార దశకు రావడంలో ఆలస్యం జరుగుతోంది. అంతేకాకుండా, కొన్ని చోట్ల కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత హైవేల కంటే ఎక్కువ ఎత్తులో వంతెనలు నిర్మించాల్సి రావడం, వాటికోసం అప్రోచ్‌లు ఏర్పాటు చేయడం, భూసేకరణ చేయడం వంటి పనులు మరింత సవాళ్లుగా మారాయి. అయినా అన్ని అడ్డంకులను దాటుకుంటూ పోలవరం ఎడమ కాలువను గడువులోపు పూర్తిచేసేందుకు అధికారులు కట్టుదిట్టంగా పనిచేస్తున్నారు.