పాదయాత్రలో లోకేశ్ ప్రచార వాహనం సీజ్, టీడీపీ శ్రేణుల నిరసన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఏడోరోజుకు చేరుకుంది. పలమనేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ప్రచార రథంపై ఎక్కి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన పోలీసులు అనుమతి లేకుండా ప్రచార రథాన్ని తీసుకొచ్చారని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సమీపంలోకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇది లోకేష్‌తో పాటు టీడీపీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం లోకేశ్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అనుమతి ఉన్నా తన వాహనాన్ని ఎందుకు సీజ్ చేశారని పోలీసులను ప్రశ్నించారు.
మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే సీజ్ చేశారు: టీడీపీ
లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని టీడీపీ ఆరోపించింది. పలమనేరు మంత్రి పెద్దిరెడ్డి జిల్లాలో ఉండటం వల్లే, ఆయన ప్రోద్బలంతోనే అన్ని అనుమతులు ఉన్నా, ప్రచార రథాన్ని సీజ్ చేశారని టీడీపీ విమర్శించింది. పరిస్థితి అదుపు తప్పుందని భావించిన పోలీసలు ప్రచారం రథానికి సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించారు. అన్ని అనుమతులు ఉన్నాయని నిర్ధారించుకున్నాక, వాహనాన్ని విడుదల చేశారు. అనంతరం లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు. జనవరి 27న నారా లోకేశ్ 'యువగళం' పేరుతో తన పాద యాత్రకు శ్రీకారం చుట్టారు. 400రోజలు పాటు 4వేల కిలోమీటర్ల పాటు ఈ పాదయాత్ర సాగనుంది. కుప్పుంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.