Delhi Pollution: కాలుష్య నియంత్రణ చర్యల తనిఖీకి గ్రౌండ్ లెవెల్లో ఢిల్లీ మంత్రులు
దేశ రాజధానిలో వాయు కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేసేందుకు దిల్లీ ప్రభుత్వ మంత్రులందరూ గ్రౌండ్ లెవెల్లో పని చేస్తారని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ గురువారం తెలిపారు. ఇక్కడ విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP)కేంద్రం వాయు కాలుష్య నియంత్రణ ప్రణాళికలో పేర్కొన్న చర్యల అమలులో అధికారుల నిర్లక్ష్యంపై రాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులందరూ గ్రౌండ్ లెవెల్లో పని చేస్తారని అలాగే తనిఖీలు కూడా నిర్వహిస్తారని అయన తెలిపారు. అన్ని వాయు కాలుష్య నియంత్రణ చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు ఆయన అన్నారు. రాయ్ ఢిల్లీలోని ఉత్తర,ఈశాన్య జిల్లాల్లో ఈ చర్యల అమలును పర్యవేక్షిస్తారు. కైలాష్ గెహ్లాట్ నైరుతి, పశ్చిమ జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తారు.
అన్ని రకాల నిర్మాణ పనులపై నిషేధం
తూర్పు,ఆగ్నేయ జిల్లాలకు అతిషి, దక్షిణ,న్యూఢిల్లీ జిల్లాలకు సౌరభ్ భరద్వాజ్,సెంట్రల్,షహదారా జిల్లాలకు ఇమ్రాన్ హుస్సేన్, వాయువ్య జిల్లాకు రాజ్ కుమార్ ఆనంద్ బాధ్యత వహిస్తారు. GRAP చివరి దశ కింద తప్పనిసరి చేసిన కఠినమైన ఆంక్షలు దేశ రాజధానిలో అమలు చేయబడ్డాయి. నగరంలో గాలి నాణ్యత 'తీవ్రమైన ప్లస్' స్థాయికి పడిపోయిన తర్వాత,అన్ని రకాల నిర్మాణ పనులపై నిషేధం విధించారు. ఢిల్లీలోకి కాలుష్యకారక ట్రక్కుల ప్రవేశంతో సహా GRAP దశ IV కింద ఆంక్షలు ఆదివారం అమలులోకి వచ్చాయి.