Poonch attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించగా.. మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో పాగా వేసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ మేరకు రాజౌరి, పూంచ్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైన్యం నిలిపివేసింది. గురువారం మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో ధాత్యార్ మోర్ సమీపంలోని బ్లైండ్ కర్వ్ వద్ద రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు స్నిఫర్ డాగ్‌లను కూడా రంగంలోకి దింపినట్లు ఓ ఆర్మీ అధికారి తెలిపారు.
ఉగ్రదాడి వెనుక పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్
పూంచ్ ఉగ్రదాడికి తామే బాధ్యులమని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) ప్రకటించింది. పీఏఎఫ్ఎఫ్ అనేది జమ్ముకశ్మీర్‌లో మిలిటెంట్ దాడిలో నిమగ్నమైన ఒక తీవ్రవాద సంస్థ. ఈ బృందం పౌరులను, ప్రభుత్వ అధికారులను చంపడం, భారత భద్రతా దళాలపై దాడి చేయడం, రిక్రూట్‌మెంట్ కోసం యువతను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. తుపాకులు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను వినియోగించడంలో యువతకు ట్రైనింగ్ కూడా ఇస్తుంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ PAFFను తీవ్రవాద గ్రూపుగా గుర్తించింది.