Page Loader
Andhrapradesh: ప్రాజెక్టుల నిర్వహణలపై నిర్లక్ష్యం - ఆర్థికశాఖ అభ్యంతరాలతో ప్రమాదంలో డ్యామ్'లు 
ప్రాజెక్టుల నిర్వహణలపై నిర్లక్ష్యం - ఆర్థికశాఖ అభ్యంతరాలతో ప్రమాదంలో డ్యామ్'లు

Andhrapradesh: ప్రాజెక్టుల నిర్వహణలపై నిర్లక్ష్యం - ఆర్థికశాఖ అభ్యంతరాలతో ప్రమాదంలో డ్యామ్'లు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు తగిన విధంగా నిర్వహించకపోవడం, జలవనరులశాఖ పంపిన ప్రతిపాదనలను ఆర్థికశాఖ తిరస్కరించడంవల్ల వాటి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పులిచింతల, గుండ్లకమ్మ, తుంగభద్ర ప్రాజెక్టుల్లో గేట్లు విరిగిపోయాయి. అలాగే అన్నమయ్య డ్యాం, పింఛా మట్టికట్ట మట్టికట్ట కొట్టుకుపోయాయి. ఎర్రకాలువకు గండి పడటం వల్ల వేల ఎకరాల పంట నీటమునిగింది. గత ఐదు ఆరేళ్ల కాలంలో ప్రతి ఘటనలోనూ నిధుల విడుదల విషయంలో ఆర్థికశాఖ తీసుకున్న సంకుచిత వైఖరే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలకు ప్రాధాన్యమైన శ్రీశైలం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకపోవడాన్ని జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (NDSA) ఛైర్మన్ తీవ్రంగా తప్పుబడుతూ ఇటీవల ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాశారు.

వివరాలు 

రూ. 60 కోట్ల ప్రాజెక్టు కొట్టుకుపోయి, కొత్తగా రూ. 660 కోట్ల భారం 

పెన్నా నదికి ఉపనదిగా ఉన్న చెయ్యేరుపై రాజంపేట నియోజకవర్గంలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు 1976లో ప్రారంభమై 2001లో పూర్తయ్యింది. దీనిని 1996-97 ధరలతో రూ.60.44 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. దీని ద్వారా 22,500 ఎకరాల సాగునీరు అందించేవారు. 3,000 ఎకరాల ఆయకట్ట స్థిరీకరించబడింది. రాజంపేట పట్టణానికి 1.2 లక్షల మందికి తాగునీరు అందించేది. అయితే ఈ ప్రాజెక్టు నిర్వహణకు రూ.4 కోట్లు కావాలని అధికారులు సూచించినా జగన్ సర్కార్ వాటిని అందించలేదు. గేట్లు సకాలంలో తెరవకపోవడం వల్ల 2021 నవంబరులో డ్యాం ధ్వంసమైంది. ఫలితంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కొత్తగా బ్యారేజి నిర్మాణానికి రూ.660 కోట్లు అవసరమవుతోంది.

వివరాలు 

ప్రస్తుత పరిస్థితి మరింత తీవ్రం 

రాష్ట్రంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజి, గోరకల్లు బ్యాలెన్సింగ్ జలాశయం, రైవాడ, గుండ్లకమ్మ, శ్రీశైలం, మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయం, ఎర్రకాలువ ప్రాజెక్టుల నిర్వహణకు భారీగా నిధులు అవసరం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న DRIP (Dam Rehabilitation and Improvement Project) ప్రాజెక్టు ద్వారా నిధులు తీసుకోవడాన్ని ఆర్థికశాఖ అంగీకరించడం లేదు. DRIP‌లో వడ్డీ భారం అధికంగా ఉంటుందని ఆ శాఖ చెబుతోంది. అయితే తక్కువ వడ్డీతో అప్పులు తెచ్చి ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు కేటాయిస్తున్నాయా అంటే, అదీ లేదు. ఈ లోపలే కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.

వివరాలు 

తుంగభద్ర నిర్వహణకు నిధులేమీ ఇవ్వలేదు 

2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలు చేశారు. కానీ ఈ రెండుసార్లూ తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ పనులకై ఎటువంటి నిధులను కేటాయించలేదు. అనంతరం ఈ ప్రాజెక్టులో గేటు ధ్వంసమైంది. నిర్వహణ నిధులిచ్చి ఉంటే ఈ పరిస్థితి ఎదురుకాకపోయేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఖరీఫ్ సమీపిస్తుండగా నిధుల జాప్యం ఆందోళన ఖరీఫ్ సాగు కాలం దగ్గరపడుతోంది. ఈ సమయంలో కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణ అత్యంత కీలకం. ఏకంగా 7,000 పైగా పనులను గుర్తించి రూ.344.39 కోట్ల ప్రతిపాదనలను ఆర్థికశాఖకు పంపినప్పటికీ, వాటిని తిరస్కరించింది. చివరకు మంత్రిమండలికి ఆమోదానికి పంపాల్సిన అవసరం వచ్చింది. అయితే అప్పటికే వర్షాలు మొదలయ్యే పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

శ్రీశైలానికి రూ.250 కోట్లు కావాలని చెప్పినా, కేటాయింపు రూ.2.5 కోట్లు మాత్రమే 

2025-26 బడ్జెట్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు అత్యవసరంగా రూ.250 కోట్లు అవసరమని జలవనరులశాఖ స్పష్టంగా వివరించింది. ఇతర ప్రాజెక్టులకు కాకపోయినా శ్రీశైలం ప్రాధాన్యతను గుర్తించాలని కోరింది. కానీ ప్రభుత్వం కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే కేటాయించింది. మరోవైపు ప్రస్తుతం అంతగా ఉపయోగపడని పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించడమంటే ఆశ్చర్యకరం. ఇదే ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపేయాలనే నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

ముఖ్యమంత్రి పర్యటనల్లో నిర్వహణపై ఫిర్యాదులు

2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రాజెక్టుల నిర్వహణకు రూ.301.16 కోట్ల ప్రతిపాదనలు పంపగా,2,340 అత్యవసర పనులను గుర్తించినా ఆర్థికశాఖ నిధుల్లేవంటూ ఫైల్ తిరస్కరించింది. చివరికి విపత్తు నిర్వహణ విభాగం నుంచి నిధులు ఇస్తామని ప్రకటించారు.అయితే అప్పటికే సమయం దాటి పోయింది. ముఖ్యమంత్రి పర్యటనల్లో నిర్వహణపై ఫిర్యాదులు రావడం పరిపాటిగా మారింది.దీనిపై సీఎం ప్రశ్నించేవారు. సీఎంఓ వివరణ కోరేది. ప్రతిసారీ జలవనరులశాఖ నుండి సమాధానం ఒకటే - ఆర్థికశాఖ నిధులు ఇవ్వలేదు.