
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి కోర్టు 14 రోజుల రిమాండ్..
ఈ వార్తాకథనం ఏంటి
కులాలు, సినీ అభిమానులు,రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు,వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో నమోదైన కేసులో వైఎస్సార్సీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
గురువారం రాత్రి 9:30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5:00 గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
పోసాని తరఫున అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం,పోసానికి 41ఏ నోటీసులు జారీ చేసి బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.
అయితే, మెజిస్ట్రేట్ ఈ అభ్యర్థనను తిరస్కరించి, 14రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాలు
జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు
దీంతో పోసాని కృష్ణమురళి మార్చి 12 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు. ఆయనను కడప కేంద్రకారాగారానికి తరలించే అవకాశం ఉంది.
ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత జోగినేని మణి ఫిబ్రవరి 24న పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన పోలీసులు, పోసానిపై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు, అనంతరం పోసానిని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.