Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు.
రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న పోసానిని ఆంధ్రప్రదేశ్‌లోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించిన అనంతరం, ఆయన్ను ఏపీకి తరలిస్తున్నారు.
పోసాని కృష్ణ మురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
సినిమా పరిశ్రమపై విమర్శలు చేసినందుకు సంబంధించి స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్సై రాయదుర్గానికి చేరుకుని పోసానిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
కూటమి నేతల ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు
గురువారం ఉదయానికి ఆయన్ను ఓబులవారిపల్లెకు తరలించే అవకాశముంది.
అనంతరం, రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదానికి దిగారు.
తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయడంతో, పోలీసులు ఎంతో కష్టపడి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో, పోసాని ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా సేవలందించారు.
ఆ సమయంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేశ్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
కూటమి నేతల ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు పోసానిపై కేసు నమోదు చేశారు.
వివరాలు
రాజకీయాలకు దూరంగా ఉంటా: పోసాని
అంతేకాకుండా, రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో కూడా పోసానిపై కేసులు నమోదయ్యాయి.
తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే కాకుండా, తిరుమల కొండపై దోపిడీ చేసేందుకు వచ్చినట్లుగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం అనంతరం, పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.