Maharashtra: అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. తృటిలో తప్పించుకున్న గర్భిణి
మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో గంభీర ప్రమాదం చోటుచేసుకుంది.అంబులెన్స్‌లో ఉన్న గర్భిణీ,ఆమె కుటుంబం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బుధవారం ఈ పేలుడు జరిగినప్పుడు సమీప ఇళ్ల కిటికీ అద్దాలు కూడా పగిలాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.ప్రస్తుతం అంబులెన్స్ పేలుడు వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. పోలీసుల వివరాల ప్రకారం,జల్గావ్‌లోని దాదావాడి సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జల్గావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్తున్న గర్భిణీ,ఆమె కుటుంబంతో ఉన్న అంబులెన్స్‌లో ఈప్రమాదం చోటు చేసుకుంది.
డ్రైవర్, గర్భిణీ, ఆమె కుటుంబం సురక్షితం
డ్రైవర్ ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించి వాహనం ఆపి,అందరినీ దిగిపోవాలని అప్రమత్తంగా కోరాడు. అలాగే సమీప ప్రజలను కూడా దూరంగా ఉండమని హెచ్చరించాడు. కాసేపట్లో అంబులెన్స్‌లోని ఆక్సిజన్ ట్యాంక్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్, గర్భిణీ, ఆమె కుటుంబం సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటన జరిగింది.