Page Loader
Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక నేడు విడుదలయ్యే అవకాశం
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక నేడు విడుదలయ్యే అవకాశం

Air India: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక నేడు విడుదలయ్యే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా ఏఐ-171 విమాన ప్రమాదంపై అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రచురితమైన కథనం ప్రకారం,ఈ ఘటనకు కారణంగా ఇంధన సరఫరా స్విచ్‌లు ఆఫ్‌ చేయబడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధికారుల అంచనాలను ఉటంకిస్తూ ఈ కథనం కీలక విషయాలను వెల్లడించింది. విమానంలోని రెండు జెట్‌ ఇంజిన్లు - ఇవి జీఈ కంపెనీ తయారీగా ఉంటాయి - టేకాఫ్ సమయంలో సక్రమంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. అయితే, ఇంధన సరఫరా చేసే స్విచ్‌లు ఆఫ్‌ అయ్యి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇది జరిగితే, విమానం గాలిలోకి ఎగిరిన వెంటనే థ్రస్ట్‌ను కోల్పోయి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

విమానం ఎగిరే సమయంలో ఈ స్విచ్‌లు నార్మల్‌ స్థితిలో ఉన్నాయి: వాల్ స్ట్రీట్

సాధారణంగా, విమానం ఇంజిన్లను ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, లేదా అత్యవసర పరిస్థితుల్లో రీసెట్ కోసం ఈ స్విచ్‌లు ఉపయోగిస్తారు. విమానం ఎగిరే సమయంలో ఈ స్విచ్‌లు నార్మల్‌ స్థితిలో ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే, అవి ఎందుకు ఆఫ్‌ అయ్యాయన్న అంశాన్ని నిపుణులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అవి ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేయబడ్డాయా? లేకపోతే ఆఫ్‌ అయిన తర్వాత వాటిని తిరిగి ఆన్‌ చేయడానికి ప్రయత్నించారా? అనే విషయంలో స్పష్టత లేదని తెలిపింది. ఇంధన స్విచ్‌లు ఆఫ్‌ అయిపోయి ఉంటే, ర్యామ్ ఎయిర్ టర్బైన్‌ (RAT) యాక్టివేట్‌ అవడం సాంకేతికంగా సజావుగా జరిగే పరిణామమని కూడా వ్యాఖ్యానించారు.

వివరాలు 

ప్రమాదానికి విమానం మోడల్‌గానీ, జీఈ ఇంజిన్లగానీ సంబంధం లేదు 

ఇదిలా ఉంటే, ఈ ఘటనపై భారత్‌కు చెందిన విమాన ప్రమాదాల విచారణ సంస్థ.. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ దర్యాప్తు ప్రాథమిక నివేదికను త్వరలో విడుదల చేయవచ్చని అంచనాలు ఉన్నాయి. అమెరికాలోని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌ (NTSB) కూడా భారత దర్యాప్తునకు సహకరించుతోంది. అయితే, భారత ప్రభుత్వం ఇతర దేశాలతో డేటా షేర్ చేయడంపై అభిప్రాయ భేదాలున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ ప్రమాదానికి విమానం మోడల్‌గానీ, జీఈ ఇంజిన్లగానీ సంబంధం లేదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు FAA (Federal Aviation Administration),బోయింగ్‌, లేదా జీఈ సంస్థలు ఎటువంటి సర్వీస్ బులెటిన్‌ను విడుదల చేయలేదని వారు వెల్లడించారు.

వివరాలు 

కేంద్ర పౌరవిమాన మంత్రిత్వశాఖకు ప్రాథమిక నివేదిక సమర్పించిన ఏఏఐబీ 

ఇదే విషయాన్ని వైమానిక రంగానికి చెందిన పత్రిక ది ఎయిర్ కరెంట్ కూడా పేర్కొంటూ, మొత్తం దర్యాప్తు ఇంధన కంట్రోల్ స్విచ్‌ల చుట్టూ తిరుగుతుందని తెలిపింది. అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉండటంతో, సమర్పితమయ్యే తాజా సమాచారాన్ని బట్టి అభిప్రాయాలు మారవచ్చని హెచ్చరించింది. ఇప్పటి వరకు జరిగిన విశ్లేషణ ఆధారంగా, ఏఏఐబీ ప్రాథమిక నివేదికను తయారు చేసి, మంగళవారం కేంద్ర పౌరవిమాన మంత్రిత్వశాఖకు, సంబంధిత ఇతర అధికారులకు సమర్పించినట్లు ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

 ప్రమాదంపై  ఏఏఐబీ దర్యాప్తు

ఈ ప్రమాదం జూన్ 12న చోటుచేసుకోగా, మరుసటి రోజు ఏఏఐబీ ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో విమాన వైద్యశాఖ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ నిపుణులు,అమెరికా ఎన్టీఎస్బీ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానం నుంచి బ్లాక్‌బాక్స్‌లను AEIB ల్యాబ్‌కి తరలించి, అందులోని డేటాను విజయవంతంగా డౌన్‌లోడ్‌ చేసి విశ్లేషణ కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలను గుర్తించేందుకు ప్రస్తుతం సాంకేతిక విశ్లేషణ జరుగుతోంది.