Farooq Abdullah: బీజేపీని అడ్డుకునేందుకు పొత్తులకైనా సిద్ధం.. ఫరూఖ్ అబ్దుల్లా
బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు, ఎన్నికల ఫలితాల అనంతరం 'వ్యూహాత్మక పొత్తు' కోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి) సిద్ధంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభ్యున్నతే లక్ష్యమైతే, కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రత్యర్థులం కావొచ్చు, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అభ్యంతరం లేదని, ఇందులో కాంగ్రెస్ పార్టీకి కూడా అభ్యంతరం ఉండదని భావిస్తున్నానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ చేయడం తన ఉద్దేశం కాదని, తాను తన బాధ్యతను పూర్తిగా నిర్వహించానని, తన దృష్టిలో ఉన్న ప్రధాన సమస్య బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే అని అబ్దుల్లా పేర్కొన్నారు.
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను సంప్రదిస్తాం
ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను సంప్రదించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే వాళ్లను బలవంతం చేయడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కలిగిన వారిని స్వాగతించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇతర పార్టీల మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఆచితూచి స్పందించిన పిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ, ప్రజల తీర్పును గౌరవిస్తూ, తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దృష్ట్యా, పిడిపి 12 సీట్ల వరకు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.