France President: నేడు భారత్ కి రిపబ్లిక్ డే ముఖ్య అతిథి.. ప్రధానితో కలిసి రోడ్డు షో
ఈ ఏడాది రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మన దేశాన్ని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా గురువారం మాక్రాన్ జైపూర్‌లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్ ను సందర్శిస్తారు. అనంతరం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన జంతర్ మంతర్‌కు వెళ్లి అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. ఫ్రెంచ్ వారికి చారిత్రక ప్రాధాన్యత ఉన్నందున ఇద్దరు నేతలు ట్రిపోలియా గేట్‌కు కాలినడకన వెళ్లనున్నట్లు సమాచారం.
జైపూర్‌లో ఇద్దరు నేతలు రోడ్ షో
1734లో,అప్పటి ఫ్రెంచ్ నియంత్రణలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని చందర్‌నాగోర్(ప్రస్తుతం చందన్‌నగర్)లోని జెస్యూట్ మిషన్‌లో ఉన్న ఇద్దరు ఫ్రెంచ్ జెస్యూట్ ఖగోళ శాస్త్రవేత్తలు జైపూర్ స్థాపకుడు ఖగోళ శాస్త్రవేత్త సవాయ్ జై సింగ్ ఆస్థానానికి ఆహ్వానించబడ్డారని,పండితుడు ధ్రువ్ రైనా తెలిపారు. ప్రధాని మోదీ,మాక్రాన్ జంతర్ మంతర్ నుండి సంగనేరి గేట్ వరకు హవా మహల్‌లో స్టాప్‌ఓవర్‌తో ఉమ్మడి రోడ్‌షోను ప్రారంభిస్తారు. హవా మహల్‌లో ఫోటో op ప్లాన్ చేశారు.ఈ పర్యటనలో ప్రధాని మోదీ,మాక్రాన్ ఇద్దరూ హస్తకళల దుకాణం, టీ దుకాణాన్ని సందర్శించే అవకాశం ఉంది. అనంతరం ఇరువురు నేతలు చారిత్రక ఆల్బర్ట్ హాల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు.ఈ రోజు రాంబాగ్ ప్యాలెస్‌తో పర్యటన ముగుస్తుంది. అక్కడ ప్రధాని మోదీ మాక్రాన్‌కు ప్రైవేట్ విందును ఏర్పాటు చేస్తారు.
బాస్టిల్ డే పరేడ్‌కు గౌరవ అతిథిగా మోదీ
ఆ తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. పరేడ్ తర్వాత, మాక్రాన్ అక్కడి సిబ్బందితో సంభాషించడానికి ఫ్రెంచ్ రాయబార కార్యాలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో 'ఎట్‌హోమ్' కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం అధికారిక విందులో పాల్గొంటారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్ తో పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ,భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం. గత ఏడాది జూలైలో ప్యారిస్‌లో జరిగిన బాస్టిల్ డే (ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం) పరేడ్‌కు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.