Eid Milad-un-Nabi: ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి , ప్రధాని
ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో సందేశం పంపుతూ, "ఈద్ ముబారక్! ఈ ప్రత్యేక సందర్భంగా శుభాకాంక్షలు. మనందరి మధ్య సామరస్యం,ఐక్యత వెల్లివిరిసి, సంతోషం, శ్రేయస్సు అన్నింటా వ్యాపించాలని కోరుకుంటున్నాను." అని అయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "మనమందరం పవిత్ర ఖురాన్ బోధనలను స్వీకరించాలని అన్నారు. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా దేశప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సమాజానికి చెందిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆమె, సమాజంలో శాంతి, సమానత్వం కోసం ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేశారు.
మహమ్మద్ ప్రవక్త జన్మించిన మాసం
ఈద్-ఎ-మిలాద్ ఇస్లామిక్ క్యాలెండర్ మూడవ నెల అయిన రబీ ఉల్ అవల్ సందర్భంగా జరుపుకుంటారు. ఈ నెలలో మహమ్మద్ ప్రవక్త జన్మించినందున ఈ మాసం ప్రత్యేకమైనది. ఈ రోజున ముస్లిం సమాజంలోని ప్రజలు అయన జన్మదినాన్ని జరుపుకుంటారు, అతని బోధనలను స్మరించుకుంటారు. ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఊరేగింపులు జరగనున్నందున ఈరోజు(సెప్టెంబర్ 16) ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని పోలీసులు ఆదివారం అడ్వైజరీ జారీ చేశారు.