
Pakistan: పాకిస్థాన్‌లో హిందూ శాసనసభ్యుడిపై దాడి.. ఖండించిన ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో హిందూ శాసనసభ్యుడిపై దాడి ఘటన కలకలం రేపుతోంది.
సింధ్ రాష్ట్రానికి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పార్టీ శాసనసభ్యుడు, మత వ్యవహారాల సహాయ మంత్రి ఖేల్ దాస్ కోహిస్తానీ (Kheal Das Kohistani)పై తీవ్రంగా దాడి జరిగింది.
ఈ ఘటనపై దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. ప్రజా ప్రతినిధులపై దాడులు ఏమాత్రం సహించరాదని పేర్కొన్న ఆయన, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దాడి ఘటనపై కోహిస్తానీతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రధాని తెలిపారు.
ఇదే ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా కూడా స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
Details
ఘటనపై పూర్తి నివేదికివ్వాలి
ఘటనలో పాల్గొన్న దుండగులను వెంటనే అరెస్టు చేయాలని, పూర్తి నివేదిక సమర్పించాలంటూ అధికారులను ఆదేశించారు.
ఇక ఘటన వివరాల్లోకి వెళితే... మత పరంగా హిందూ అయిన ఖేల్ దాస్ కోహిస్తానీ, పాకిస్థాన్‌లో మత వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సింధ్ రాష్ట్రంలో నిర్మించబోయే కొత్త కాలువలపై ఆయన ఇటీవల ఓ ప్రణాళికను రూపొందించారు.
శనివారం నాడు కోహిస్తానీ తట్టా జిల్లాలో గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ, ఆయన కాన్వాయ్‌పై కర్రలు, టమాటాలు, బంగాళాదుంపలతో దాడికి దిగారు.
అయితే ఈ దాడిలో కోహిస్తానీకి ఎలాంటి గాయాలు తలెత్తలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, దుండగులను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.