Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. తాను, తన స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్‌లో భాగమయ్యాయని, ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పారు. ఈ చొరవ స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని తన ఎక్స్‌లో మోదీ వివరించారు. ప్రధాని మోదీ పిలుపునకు పలువురు రాజకీయ నాయకులు స్పందించి, స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2014లో 'స్వచ్ఛ భారత్' ప్రారంభం
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, రాజివ్ రంజన్, ముఖేశ్ మాండవీయతో పాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా 'స్వచ్ఛ్ భారత్' కార్యక్రమం ప్రారంభమైంది. మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా శుభ్రతను ప్రోత్సహించడానికి మోదీ ప్రధానంగా ప్రణాళికలు రచించారు.