అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండకూడదన్నారు. తొలుత ప్రధాని మోదీ 'ప్రియమైన సోదర, సోదరీమణులారా, మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారములు' అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. భాగ్యలక్ష్మి నగరాన్ని, వేంకటేశ్వర స్వామి దేవస్థానం నగరాన్ని ఈ వందేభారత్ ఎక్స్ ప్రెక్స్ రైలు ద్వారా కలిపినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చేందుకు ఎన్డీయే కట్టుబడి ఉంది: మోదీ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల కలలను నెరవేర్చేందుకు కేంద్రంలోని ఎన్డీయే కట్టుబడి ఉందన్నారు. రైల్వే లైన్లు, కొత్త సేవలు, జాతీయ రహదారి ప్రాజెక్టులను రెట్టింపు చేయడం వంటి రైలు, ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం మద్దతు ఇస్తోందన్నారు. కొత్తగా ప్రారంభించిన రైల్వే ప్రాజెక్టులు కనెక్టివిటీని సృష్టిస్తాయన్నారు. ప్రజలకు జీవనోపాధిని సృష్టించడానికి, పర్యాటకం ఆర్థిక కార్యకలాపాలకు దోహదంగా నిలుస్తాయని మోదీ స్పష్టం చేశారు.
కేసీఆర్ కుటుంబంపై మోదీ పరోక్ష విమర్శలు
కొద్దిమంది అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై మోదీ పరోక్ష విమర్శలు చేశారు. వారికి దేశాభివృద్ధి కంటే వారి కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. కేంద్రం నుంచి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ నిధులు తమ చేతుల్లోకి రావాలని రాష్ట్రం ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అవినీతిని రూపుమాపేందుకు కేంద్రం పోరాడుతోందని మోదీ స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా కేంద్రం చేస్తున్న పోరాటానికి ఉపశమనం, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు.