ఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం దిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, దిల్లీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మార్చి 13న కాంగ్రెస్‌కు కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి నవంబర్ 11, 2010న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్పీకర్‌గా, చీఫ్ విప్‌గా సేవలు
యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి నిరసనగా మార్చి 10, 2014న కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయించారు. రాష్ట్ర విభజన తర్వాత 'జై సమైక్యాంధ్ర' అనే సొంత పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2009 నుంచి 2010 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా, 2004-09 మధ్య చీఫ్ విప్‌గా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు.