ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించడంతో పాటు అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ప్రధాని మోదీ ఏప్రిల్ 8న తెలంగాణకు రానున్నారు. ఇదే సమయంలో కరీంనగర్‌లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్‌ను ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రం లీక్ కేసులో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం వల్లే బండి సంజయ్‌ను అరెస్టు చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు.
సంజయ్ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు
బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. అర్ధరాత్రి పార్లమెంటు సభ్యుడిని ఈ రకంగా అరెస్టు చేయడం ఏంటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చట్టపరమైన చర్య తీసుకోవాలంటే ఉదయాన్నే తీసుకోవాలని, బండి సంజయ్ ఎక్కడికి వెళతారని, ఈ చర్య తెలంగాణలో ప్రధాని మోదీ కార్యక్రమానికి భంగం కలిగించడానికి చేసిందే తప్పా మరొకటి కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి మండిపడ్డారు. మరో మూడు రోజుల్లో ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ అరెస్టు పొలిటికల్ హీట్‌ను పెంచేసింది. అరెస్టు నేపథ్యంలో ప్రధాని పర్యటనలో సంజయ్ పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బండి సంజయ్‌పై సీఆర్‌పీసీ సెక్షన్లు 154, 157 కింద అభియోగాలు
ఎస్‌ఎస్‌సీ హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పేపర్ లీక్ కేసులో నిందితుడిగా బండి సంజయ్ పేరును చేర్చారు పోలీసులు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం సీఆర్‌పీసీ 154, 157 సెక్షన్ల కింద అతడిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ కుట్రలో భాగమని పోలీసులు ఆరోపిస్తున్నారు.