ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి!
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్‌ను భారతీయ రైల్వే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును నడిపేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 8న తేదీన సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ రైలు కోసం సికింద్రాబాద్ నుంచి మిర్యాలగూడ- బీబీ నగర్-నడికుడి- గుంటూరు మీదుగా తిరుపతి వెళ్లే మార్గాన్ని అధికారులు ఎంచుకున్నారు. బీబీ నగర్-నడికుడి మార్గం గుండా వెళితే ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ రైల్వే ట్రాక్‌ను 130కిలో మీటర్ వేగంతో ప్రయాణించేలా అప్ గ్రేడ్ కూడా చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతికి వేలాది మంది భక్తులు వెళుతుంటారు. ఈ క్రమంలో రద్దీని తగ్గించడానికి ఈ సర్వీసు దోహదపడుతుందని భారతీ రైల్వే భావిస్తోంది.
6 నుంచి 7గంటల్లోనే సికింద్రాబాద్-తిరుపతికి చేరుకోవచ్చు
ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించడానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రూపొందించినట్లు భారతీయ రైల్వే చెబుతోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఈ గణనీయమైన వేగాన్ని పెంచడం వల్ల సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో 12 గంటల్లో ప్రయాణిస్తుంది. అయితే వందే భారత్ రైలు 6 నుంచి 7 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేయనుంది. రైలు ఆగే స్టేషన్లపై ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా గుంటూరు, నెల్లూరు స్టేషన్లలో రైలు ఆగోచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వందేభారత్ రైలు టిక్కెట్ ధర ఒక్కరికి రూ. 1150
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు టిక్కెట్ ధర ఒక్కరికి రూ. 1150గా నిర్ణయించారు. అయితే ఇతర రైలు టికెట్లతో దీన్ని పోల్చకోవద్దని అధికారులు సూచించారు. రైలులో ఆహారం, టిఫిన్ వంటి కొన్ని సౌక్యర్యాలను బట్టి టికెట్ ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అన్నింటికి మించి మిగతా రైళ్లతో పోల్చితే చాలా తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చని తెలిపారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశం అంతటా రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తోంది. వందేభారత్ కోసం చెన్నై-కోయంబత్తూరు, జైపూర్-దిల్లీ రైల్వే మార్గాలను అభివృద్ధి చేస్తోంది.