ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఆసియాలోనే అతిపెద్ద ఎయిరో షో 'ఏరో ఇండియా 2023' 14వ ఎడిషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో స్వదేశీ సాంకేతికతలను ప్రదర్శించడంతో పాటు విదేశీ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడంపై దృష్టి సారిస్తారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ ప్రముఖ యుద్ధ విమానాల్లో ఒకటైన ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్‌తో పాటు ఎఫ్/ఏ-18ఈ, ఎఫ్/ఏ-18ఎఫ్ సూపర్ హార్నెట్, అమెరికా అత్యంత అధునాతన ఫ్రంట్‌లైన్ క్యారియర్-బేస్డ్, మల్టీరోల్ స్ట్రైక్ ఫైటర్ జెట్లను ఏరో షో ప్రదర్శించనున్నారు. 98దేశాలకు చెందిన దాదాపు 809 రక్షణ రంగ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొననుండటం గమనార్హం.
251 ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం
'మేక్ ఇన్ ఇండియా' విధానంలో భాగంగా రక్షణ విమాన రంగంలో దేశ సాంకేతికతను చాటేందుకు మోదీ ప్రభుత్వం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా దేశీయంగా తయారు చేసిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ)-తేజాస్, హెచ్‌టీటీ-40, డోర్నియర్ లైట్ యుటిలిటీ హెలికాప్టర్ ( ఎల్‌యూహెచ్)వంటి ఎగుమతులు పెరుగుతాయని కేంద్రం భావిస్తున్నట్లు పీఎంఓ తెలిపింది. ఈ సందర్భంగా భారతీయ, విదేశీ రక్షణ సంస్థల మధ్య రూ.75,000కోట్ల పెట్టుబడుల అంచనాతో 251ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఏరో ఇండియా 2023లో ఎయిర్‌బస్, బోయింగ్, డస్సాల్ట్ ఏవియేషన్, లాక్‌హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సి రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్ లాంటి కంపెనీలు పాల్గొననున్నయి.