Sabarmati Report: 'సబర్మతి రిపోర్ట్' చిత్రాన్ని పార్లమెంట్‌లో చూడనున్న ప్రధాని మోదీ
గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందించిన 'ది సబర్మతి రిపోర్ట్' చిత్రాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ ప్రాంగణంలో వీక్షించనున్నారు. ఈ చిత్రం సోమవారం సాయంత్రం బాలయోగి ఆడిటోరియంలో ఇతర ప్రముఖ రాజకీయ నేతలతో కలిసి చూడనున్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2002 ఫిబ్రవరి 27న పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు దుండగులు నిప్పు పెట్టారు, ఆ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
వాస్తవాలు వెలుగులోకి రావడం సంతోషకరం : మోదీ
ఈ ఘటన ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా 'ది సబర్మతి రిపోర్ట్' సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఉద్దేశించి ఒక నెటిజన్ 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు. ప్రతిఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, కల్పిత కథనాలు పరిమితకాలమే కొనసాగుతాయని చెప్పారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందని ఈ సినిమాపై మోదీ ప్రశంసలు కురిపించారు.