మిల్లెట్ ప్రయోజనాలపై ప్రత్యేక పాట; గ్రామీ విజేత ఫాలుతో కలిసి రాసి, పాడిన మోదీ
గ్రామీ అవార్డు విజేత భారతీయ అమెరికన్ గాయకురాలు ఫాలుతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మిల్లెట్ల ప్రయోజనాలు, ప్రపంచ ఆకలిని తగ్గించడంలో మిల్లెట్ల ప్రాముఖ్యను వివరిస్తూ ఒక ప్రత్యేక పాటను రూపొందించారు. ఫాలుతో పాటు ఆమె భర్త, గాయకుడు గౌరవ్ షా నటించిన 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' పాట జూన్ 16న స్ట్రీమింగ్ విడుదల కానుంది. 2023 సంవత్సరాన్ని 'అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం'గా జరుపుకోవాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. దీనికి ఐక్యరాజ్య సమితి కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మిల్లెట్స్ ప్రచారం కోసం ప్రధాని మోదీ విస్తృతంగా కృషి చేస్తున్నారు.
ఇంగ్లీషు, హిందీ భాషల్లో పాట విడుదల
'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' పాటపై ఫాలు స్పందించారు. ప్రధాని మోదీ నాతో, తన భర్త గౌరవ్ షాతో కలిసి ఒక పాట రాశారని తెలిపారు. ఈ పాటలో ఆయన గొంతు కూడా ఉంటుందని ఆమె చెప్పారు. ఇంగ్లీషు, హిందీ భాషల్లో రాసిన ఈ పాట ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వస్తుందని, మిల్లెట్ల శక్తిని తెలియజేస్తుందని ఆమె అన్నారు. ఇతర భాషల్లోకి కూడా అనువాదం చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామీ అవార్డు తర్వాత గతేడాది దిల్లీలో మోదీని కలిసినప్పుడు మిల్లెట్ల గురించి ఓ పాట రాయాలనే ఆలోచన వచ్చిందని ఫాలు చెప్పారు. ఆకలిని అంతం చేసే సందేశంతో కూడిన పాట రాయాలని, అయితే అది మిల్లెట్స్ నేపథ్యంలో ఉండాలని ప్రధాని తనకు సూచించారని ఆమె అన్నారు.