సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ
మధ్యప్రదేశ్ బినాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విపక్ష ఇండియా కూటమి 'సనాతన ధర్మాన్ని' నాశనం చేయాలనుకుంటోందన్నారు. సనాతన ధర్మంపై డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలఅనంతరం మొట్టమొదటి సారి ప్రధాని ఈ విషయమై స్పందించారు. మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని రూ. 50,700 కోట్లకు పైగా విలువైన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా రాష్ట్రంలో మరో పది కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇటీవల ముంబైలో సమావేశం నిర్వహించిన,'ఘమాండీ' కూటమికి సరైన నాయకుడు లేడని .. వారు భారతదేశ సంస్కృతిపై దాడి చేయడానికి రహస్య అజెండాను నిర్ణయించుకున్నట్లు ఆరోపించారు.
జీ20 సదస్సు 140 కోట్ల మంది ప్రజల విజయం: మోదీ
సనాతన సంస్కృతిని నాశనం చేయాలనే తీర్మానంతో ఇండియా కూటమి ఉందన్నారు. ఈ అజెండాపై దేశాన్ని ప్రేమించే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. దిల్లీ వేదికగా జీ20 సదస్సును భారత్ ఎలా విజయవంతంగా నిర్వహించిందో ప్రజలంతా చూశారని.. ఈ ఘనత దేశ ప్రజలకు దక్కుతుందని.. ఇది 140 కోట్ల మంది ప్రజల విజయమని మోదీ అన్నారు. ఈ నెల ప్రారంభంలో, డీఎంకే నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చారు. దానిపై భగ్గుమన్న అధికార బీజేపీ విపక్ష ఇండియా కూటమిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది.