బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లలోని కీలక ఆరోపణలను వివరిస్తూ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన పేపర్ కటింగ్‌ను ట్వీట్టర్‌లో షేర్ చేశారు. బ్రిజ్ భూషణ్ సింగ్ వ్యవహారంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనం వీడటం లేదని ప్రియాంక ప్రశ్నించారు.
ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్
బ్రిజ్ భూషణ్ ఎందుకు కాపాడుతున్నారు: ఎంపీ ప్రియాంక చతుర్వేది
శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసిన పేపర్ కటింగ్‌ను ట్వీట్టర్‌లో షేర్ చేశారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను ప్రభుత్వం, బీజేపీ ఎందుకు రక్షిస్తున్నాయని ప్రశ్నించారు. సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రధానమంత్రి ఈ వ్యక్తిని కాపాడుతూనే ఉన్నారని, ఆఖరికి కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా మౌనంగా ఉన్నారన్నారు. క్రీడా మంత్రి కళ్లు మూసుకుపోయారని మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలో కనీసం 15 లైంగిక వేధింపుల సంఘటనలు ఉన్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. ఇందులో 10సంఘటనలు అనుచితంగా తాకడం, వేధింపులు, రొమ్ములపై చేతులు పెట్టడం, నాభిని తాకడం లాంటి అభియోగాలు ఉన్నాయి.