Page Loader
Priyanka Gandhi: 'మీడియా వక్రీకరించింది'.. రాష్ట్రపతిని సోనియా గౌరవించారు: ప్రియాంక గాంధీ 
'మీడియా వక్రీకరించింది'.. రాష్ట్రపతిని సోనియా గౌరవించారు: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: 'మీడియా వక్రీకరించింది'.. రాష్ట్రపతిని సోనియా గౌరవించారు: ప్రియాంక గాంధీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
07:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ అంశం అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బీజేపీ సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా, రాష్ట్రపతి భవన్ కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేసింది.

వివరాలు 

స్పందించిన ప్రియాంక గాంధీ 

ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో వయనాడ్ ఎంపీ, సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ స్పందించారు. తన తల్లికి రాష్ట్రపతి పట్ల అపారమైన గౌరవం ఉందని, కానీ మీడియా ఆమె వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపించారు. క్షమాపణ చెప్పాల్సింది తన తల్లి కాదు, దేశాన్ని నాశనం చేసిన బీజేపీనే క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే, తన తల్లికి ఇప్పుడు 78 ఏళ్లు.. అలాగే రాష్ట్రపతి కూడా పెద్ద వయసు వారు. వారిద్దరూ గౌరవనీయమైన వ్యక్తులు అని ప్రియాంక పేర్కొన్నారు.

వివరాలు 

గిరిజన మహిళను అవమానించారు 

శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం పార్లమెంట్ హాల్ నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక బయటకు వచ్చిన సమయంలో మీడియా వారు రాష్ట్రపతి ప్రసంగంపై ప్రశ్నలు సంధించారు. దీనికి సోనియా గాంధీ స్పందిస్తూ, ప్రసంగం చివరికి రాగానే రాష్ట్రపతి అలసిపోయారని, మాట్లాడలేకపోయారని, 'పాపం' అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అత్యున్నత పదవిలో ఉన్న గిరిజన మహిళను అవమానించారంటూ సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

వివరాలు 

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు దురదృష్టకరం 

తాజాగా, రాష్ట్రపతి భవన్ కూడా దీనిపై స్పందించింది. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, రాష్ట్రపతి ఏ సమయంలోనూ అలసిపోలేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొంటూ, వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని సూచించింది. రాష్ట్రపతి అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల కోసం మాట్లాడుతున్నప్పుడు అలసిపోవడం అసంభవమని పేర్కొంది. భారతీయ భాషలు, యాసలపై అవగాహన లేకపోవడం వల్లే కాంగ్రెస్ నేతలకు ఈ విధంగా అనిపించి ఉండొచ్చని రాష్ట్రపతి భవన్ అభిప్రాయపడింది.