నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సోమవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో సోమవారం 'యువ సంఘర్షణ సభ' పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. ప్రయాంక గాంధీ రాక కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ఈ సభను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ పర్యటనపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రియాంక గాంధీని "రాజకీయ టూరిస్ట్" అని అభివర్ణించారు. కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని పేర్కొన్నారు.
తెలంగాణ యువతను రెచ్చగొడుతున్నారు: కేటీఆర్
గ్లోబల్ సిటీ హైదరాబాద్ ప్రతిరోజూ లక్షలాది మంది పర్యాటకులను స్వాగస్తుందని, ప్రియాంక గాంధీ వంటి రాజకీయ పర్యాటకులను కూడా అలాగే స్వాగతిస్తున్నామని కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం పని చేయని పార్టీలు ఇప్పుడు తెలంగాణ వంటి రాష్ట్ర ప్రభుత్వాలకు బోధిస్తున్నాయన్నారు. నిరుద్యోగులుగా ఉన్న రాజకీయ నాయకులు తెలంగాణ యువతను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి కేటీఆర్ ఫైర్ అయ్యారు. యువతను, నిరుద్యోగ సమస్యను కాంగ్రెస్ తన రాజకీయాల కోసమే దోపిడీ చేసిందని కేటీఆర్ ఆరోపించారు.