Ramesh Bidhuri: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ నేత రమేష్ బిధూరి మరోసారి తన అనుచిత వ్యాఖ్యలతో వివాదానికి కారణమయ్యారు.
దిల్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిధూరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
తాను గెలిస్తే, నియోజకవర్గ రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల వలే స్మూత్‌గా మారుస్తానని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిధూరి వ్యాఖ్యలు అతడి మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని, బీజేపీకి మహిళల పట్ల గౌరవం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే మండిపడ్డారు.
ప్రియాంకా గాంధీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలకు బీజేపీ అగ్రనాయకత్వం క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Details
గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు
గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ రోడ్లను హేమ మాలిని చెంపల వలే స్మూత్‌గా మారుస్తానని చేసిన వ్యాఖ్యలను రమేష్ బిధూరి గుర్తు చేశారు.
ఆ వ్యాఖ్యలపై ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదని, కానీ ఇప్పుడు తన వ్యాఖ్యలపై విమర్శలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
హేమ మాలిని కూడా మహిళే అని, ప్రియాంకా గాంధీ కన్నా ఆమె మరింత ఖ్యాతిని పొందారని బిధూరి అన్నారు. రమేష్ బిధూరి వ్యాఖ్యలను ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా తీవ్రంగా ఖండించారు.
మహిళల పట్ల బీజేపీకి గల గౌరవం ఇదేనా అంటూ ట్వీట్ చేశారు. బిధూరి 2023లో లోక్‌సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై మతపరమైన వ్యాఖ్యలు చేసి అప్పట్లోనూ వివాదానికి కారణమైన విషయం తెలిసిందే.