Priyanka Gandhi: రాజ్యాంగ ప్రతిని చేతపట్టి ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం, పార్లమెంటరీ ఇన్నింగ్స్ ప్రారంభం
వాయనాడ్ లోక్‌సభ స్థానం నుండి తొలిసారి ఎన్నికైన ప్రియాంక గాంధీ,పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆమెతో కలిసి తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగానే, ప్రియాంక గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని కేరళ సంప్రదాయం ప్రతిబింబించే ఆహార్యంలో ప్రవేశించారు. ఆ తరువాత, ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఇది రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని ప్రమాణ స్వీకారం చేసిన పరంపరను కొనసాగించే దృశ్యంగా మారింది.
అత్యధిక మెజారిటీతో విజయం
ప్రియాంక గాంధీ, కేరళలోని వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కొత్త రికార్డును నెలకొల్పారు. ఆమె అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఆమె సోదరుడు రాహుల్ గాంధీ గతంలో 3 లక్షల 65 వేల ఓట్ల తేడాతో ఈ స్థానంలో విజయం సాధించగా, ప్రియాంక గాంధీ ఈ సారి రాహుల్ గాంధీని కూడా మించి 4 లక్షల 3 వేల 966 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 5.78 లక్షల ఓట్లు పోలవడంతో, రెండవ స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి ఉండగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10 వేల ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.