
Mamata Banerjee: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మమతా బెనర్జీకి నిరసన సెగ
ఈ వార్తాకథనం ఏంటి
యూకే పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి నిరసన సెగ తగిలింది.
లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆమె ప్రసంగిస్తుండగా, కొందరు విద్యార్థులు అడ్డుకున్నారు.
బెంగాల్‌లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస, ఆర్జీ కర్ వైద్యురాలి హత్యాచార ఘటనలపై వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే మమతా బెనర్జీ వారికి దీటుగా సమాధానమిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Details
ఆక్స్‌ఫర్డ్‌లో విద్యార్థుల నిరసన
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని కెల్లాగ్ కాలేజీలో 'సామాజిక అభివృద్ధి - మహిళా సాధికారత' అంశంపై మమతా బెనర్జీ ప్రసంగిస్తుండగా, కొంతమంది విద్యార్థులు నిరసన తెలుపుతూ అడ్డుకున్నారు. ఆర్జీ కర్ హత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు.
అయితే దీదీ వారికి ధీటుగా స్పందించింది. 'మీరు చెప్పేది స్పష్టంగా వినిపించట్లేదు. గట్టిగా చెప్పండి. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని మీకు తెలుసా? దాని దర్యాప్తు మా చేతుల్లో లేదు.
కేంద్రమే ఈ కేసును చూసుకుంటోంది. ఇక్కడ రాజకీయాలు చేయకండి. ఇది రాజకీయ వేదిక కాదు. నేను దేశాన్ని ప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మీ నిరసన మన దేశాన్ని అవమానించినట్లేనని గట్టిగా సమాధానమిచ్చారు.
Details
పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన మమతా
నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో, మమతా బెనర్జీ 1990ల నాటి ఓ ఫొటోను ప్రదర్శించారు.
తలకు కట్టుతో, తీవ్ర గాయాలతో ఉన్న తన ఫొటోను చూపిస్తూ, ముందుగా ఈ చిత్రాన్ని చూడండి. నన్ను చంపేందుకు ఎలాంటి కుట్రలు, యత్నాలు జరిగాయో తెలుసుకోవాలన్నారు.
ఇలాంటి నిరసనలతో తనను భయపెట్టలేరని స్పష్టం చేస్తూ, తాను రాయల్ బెంగాల్ టైగర్ అని చెప్పుకొచ్చారు. దీదీ వ్యాఖ్యలతో సభలోని వారు చప్పట్లతో ఆమెకు మద్దతు తెలిపారు.
అనంతరం నిర్వాహకులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించేశారు.