Rahul Gandhi: రాహుల్ గాంధీకి పుణే కోర్టు సమన్లు.. సావర్కర్ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరోసారి కోర్టు సమన్లు జారీ అయ్యాయి. పుణే లోని ప్రత్యేక కోర్టు అక్టోబర్ 23న కోర్టుకు హాజరు కావాలని రాహుల్‌కు సమన్లు ఇచ్చింది. ఈ కేసు రాహుల్ గాంధీ గతంలో లండన్‌లో జరిగిన కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ కోర్టులో పరువు నష్టం కేసు నమోదు చేశారు. సావర్కర్‌పై తీవ్ర విమర్శలు చేశారని ఆరోపిస్తూ, సత్యకి సావర్కర్ గతంలో పుణెలోని కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
అక్టోబర్ 28న కోర్టుకు హాజరు కావాలి
పోలీసుల విచారణలో ఈ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నట్లు తేల్చారు. గత నెలలో ఈ కేసు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (ఎఫ్‌ఎంఎఫ్‌సి) కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. విచారణ సమయంలో రాహుల్ గాంధీ అక్టోబర్ 23న కోర్టుకు హాజరుకావాల్సిందిగా కోర్టు సమన్లు జారీ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇది మొదటి కేసు కాదు. గతంలో ఆయన 'మోదీ' ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల వల్ల సూరత్ కోర్టు దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ కారణంగా రాహుల్ అప్పట్లో తన ఎంపీ పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే.