Pune: పుణెలో దారుణం.. ప్రియురాలిని చంపి పోలీసులకు ఫోన్ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని పుణెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ సహజీవనం చేస్తున్న ప్రియురాలినే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య చేశాడు. ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన యువకుడు.. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు. అనంతరం రాత్రంతా ఆమె మృతదేహం పక్కనే గడిపాడు. మరుసటి రోజు ఉదయం అంబులెన్స్ కోసం పోలీసులకు ఫోన్ చేయడం కలకలం రేపుతోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పుణెలోని ఐటీ హబ్ హింజవాడిలో ఉన్న ప్రిస్టీన్ పీజీలో నవంబర్ 22 రాత్రి ఈ హత్య జరిగింది. మృతురాలిని వార్ధా జిల్లాకు చెందిన కోమల్ దహలేగా, నిందితుడిని బుల్ధానా జిల్లాకు చెందిన శుభం కల్బండేగా గుర్తించారు.
వివరాలు
రెండుమూడేళ్లుగా కలిసి సహజీవనం
వీరిద్దరూ హింజవాడిలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. శుభం ఇన్ఫోసిస్‌లో, కోమల్ విప్రోలో ఉద్యోగం చేస్తున్నారు.
వృత్తిపరంగా పరిచయమైన వీరిద్దరి మధ్య కొన్నేళ్ల క్రితం ప్రేమ చిగురించింది.
గత రెండుమూడేళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకూ తెలియడంతో పెళ్లికి కూడా అంగీకరించినట్లు సమాచారం.
అయితే శుభంకు మరో మహిళతో సంబంధం ఉందని కోమల్ అనుమానించేది. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇద్దరూ కలిసి ఓ హోటల్‌కు వెళ్లి భోజనం చేశారు. అనంతరం కోమల్ ఉంటున్న పీజీ గదికి తిరిగి వచ్చారు.
వివరాలు
పిడిగుద్దులతో దాడి.. ప్రాణాలు కోల్పోయిన యువతి
గదికి చేరుకున్న తర్వాత అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది.
ఈ వివాదం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరింత ముదిరింది.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన శుభం.. కోమల్‌పై పలుమార్లు పిడిగుద్దులతో దాడి చేశాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాలు
రాత్రంతా మృతదేహం పక్కనే.. ఉదయం పోలీసులకు ఫోన్
ప్రియురాలు చనిపోయినప్పటికీ నిందితుడు శుభం రాత్రంతా ఆమె మృతదేహం పక్కనే గడిపాడు.
మరుసటి రోజు ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేసి అంబులెన్స్ పంపించాలని కోరాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పీజీ గదికి చేరుకున్నారు. కోమల్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టగా కోమల్ హత్యకు గురైనట్లు గుర్తించారు. దీంతో నిందితుడు శుభంను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ జాదవ్ వెల్లడించారు.