LOADING...
Baljit Singh: భారత సైన్య కదలికల సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన గూఢచారి అరెస్టు
భారత సైన్య కదలికల సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన గూఢచారి అరెస్టు

Baljit Singh: భారత సైన్య కదలికల సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన గూఢచారి అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2026
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న గూఢచారి ముఠాను పంజాబ్‌ పోలీసులు బయటపెట్టారు. భారత సైన్యానికి సంబంధించిన అత్యంత సున్నితమైన వివరాలను పాక్‌కు పంపుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పఠాన్‌కోట్‌కు చెందిన బల్జీత్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పఠాన్‌కోట్‌-జమ్మూ జాతీయ రహదారిపై సైనిక వాహనాల కదలికలను గమనించేందుకు నిందితుడు నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. భారత సైన్యం, పారామిలిటరీ దళాలు తరచుగా వినియోగించే ఈ మార్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పోలీసులు తెలిపారు.Baljit Singh

వివరాలు 

ఐఎస్‌ఐకు చెందిన వ్యక్తులతో సంబంధాలు

తక్కువ ఖర్చుతో లభించే అంతర్జాల ఆధారిత నిఘా కెమెరాలను స్థానిక దుకాణం వద్ద అమర్చి.. అక్కడి నుంచి సైనికుల రాకపోకలను రహస్యంగా పర్యవేక్షించినట్లు వెల్లడించారు. ఆ దృశ్యాలను వెంటనే పాకిస్థాన్‌లో ఉన్న నిర్వాహకులకు పంపిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడికి దుబాయ్‌ నుంచి ఆదేశాలు రావడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందుతున్నట్లు పోలీసులు తెలిపారు. పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకు చెందిన వ్యక్తులతో అతడు సంబంధాలు కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఘటన అనంతరం పఠాన్‌కోట్‌ సైనిక స్థావరాల పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.

Advertisement