Kolkata Doctor Rape and Murder: పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో మాజీ ప్రిన్సిపాల్'మోసపూరిత' సమాధానాలు: సీబీఐ
కోల్‌కతా ఆర్‌జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారానికి సంబంధించిన కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ వెల్లడించింది. ఆయనకు పాలీగ్రాఫ్ టెస్టు, వాయిస్ అనాలిసిస్ నిర్వహించగా, కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 2న,వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవలకు సంబంధించి సీబీఐ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసింది. ఆ తర్వాత,ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. విచారణలో భాగంగా,ఘోష్‌కు పాలీగ్రాఫ్ టెస్టు, వాయిస్ అనాలిసిస్ నిర్వహించారు.
మహిళా వైద్యురాలిపై హత్యాచార ఘటనపై పోలీసులకు సందీప్ ఘోష్ ఫిర్యాదు చేయలేదు: సీబీఐ
ఈ టెస్టుల్లో ఆయన ఇచ్చిన సమాధానాలు మోసపూరితమైనవని దిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (CFSL) నివేదిక తెలిపింది. అయితే, పాలీగ్రాఫ్ టెస్టులో చెప్పిన సమాధానాలను సీబీఐ సాక్ష్యాలుగా కోర్టులో చూపించకపోవచ్చని, వాటిని ధ్రువీకరించే సాక్ష్యాలను సేకరించవచ్చని అధికారులు తెలిపారు. ఆగస్టు 9న ఉదయం 9:58 గంటలకు మహిళా వైద్యురాలిపై హత్యాచార ఘటనపై సందీప్ ఘోష్‌కు సమాచారం అందినా ,వెంటనే పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయలేదని సీబీఐ పేర్కొంది.
అభిజిత్ మండల్‌ను అరెస్టు చేసిన సీబీఐ
సందీప్ ఘోష్‌తో పాటు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అభిజిత్ మండల్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసి, ఆదివారం స్థానిక కోర్టులో హాజరుపర్చింది. ఈ ఘటన వెలుగుచూసిన తరువాత,ఇద్దరూ ఒకరితో ఒకరు సంప్రదింపులో ఉన్నారని,మండల్‌కు ఎలా ముందుకు వెళ్లాలో సందీప్ సూచనలు చేసినట్లు సీబీఐ కోర్టులో పేర్కొంది. ఘోష్,మండల్‌లు కలిసి నేరాన్ని తక్కువగా చూపించడంతోపాటు దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని నిందించింది.