Raaj Kumar Anand: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఆగడం లేదు. ఒకవైపు అగ్రనాయకత్వం కటకటాలపాలవుతుండగా, మరోవైపు వారి సహచరులు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. తాజాగా, మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా చేశారు. రాజ్‌కుమార్ ఆనంద్ ఢిల్లీ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. నవంబర్ 2023లో రాజ్‌కుమార్ ఆనంద్ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ఇప్పుడు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2020 సంవత్సరంలో, రాజ్‌కుమార్ ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై పటేల్ నగర్ నుండి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.
రాజీనామా తర్వాత రాజ్‌కుమార్ ఆనంద్ స్పందన
ఈ సందర్భంగా రాజ్‌కుమార్ ఆనంద్ మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిని, నాకు ఏడు శాఖలు ఉన్నాయి. కానీ ఈ రోజు నేను చాలా బాధగా ఉన్నాను. రాజకీయాలు మారితే దేశం మారిపోతుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను. అయితే ఈరోజు రాజకీయాలు మారలేదు కానీ రాజకీయ నాయకుడు మారాడని చాలా విచారంగా చెప్పాల్సి వస్తోందన్నారు. 'అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందని, అయితే నేడు ఈ పార్టీనే అవినీతి ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. మంత్రి పదవిలో ఉంటూ ఈ ప్రభుత్వంలో పనిచేయడం అసౌకర్యంగాఉందని.. అవినీతిపరులతో కలిసి ఉండలేనని , అందుకే ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.