Page Loader
Lalu Prasad Yadav: కిడ్నాపర్లతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధాలు.. రబ్రీ దేవి సోదరుడు సంచలన ఆరోపణలు 
కిడ్నాపర్లతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధాలు

Lalu Prasad Yadav: కిడ్నాపర్లతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధాలు.. రబ్రీ దేవి సోదరుడు సంచలన ఆరోపణలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ రాజ్యసభ సభ్యుడు, లాలూ ప్రసాద్ యాదవ్ బావమరిది సుభాష్ యాదవ్ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. బీహార్‌ను పాలిస్తున్న కాలంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కిడ్నాప్‌లకు పాల్పడే ముఠాలతో సంబంధాలు కొనసాగించారని ఆరోపించారు. లాలూ భార్య రబ్రీదేవీకి సుభాష్ యాదవ్ సహోదరుడు కావడం గమనార్హం. సుభాష్ యాదవ్ మాట్లాడుతూ, ''కిడ్నాప్‌ల వెనుక నా హస్తం ఉందని వారు చెబుతున్నారు. కానీ, నిజానికి ప్రజలను కిడ్నాప్ చేసి విడుదల చేయాల్సిందిగా ఆదేశించేది లాలూనే. ఆయన అధికార దుర్వినియోగంతో ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారు'' అని ఆరోపించారు. తనపై నేర ఆరోపణలకు ఆధారాలుంటే, లాలూ ప్రసాద్‌ మాదిరిగానే తానూ జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.

వివరాలు 

సాధు యాదవ్ కౌంటర్ 

ఈ ఆరోపణలపై రబ్రీదేవీ మరో సోదరుడు సాధు యాదవ్ స్పందిస్తూ, ''సుభాష్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. ఇతర రాజకీయ పార్టీల మద్దతుతో ఇలా మాట్లాడుతున్నట్లు అనిపిస్తోంది'' అని అన్నారు. ఇంకా ''సుభాష్ అనేక అనుమానాస్పద కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. నిజానికి, కిడ్నాప్ ముఠాలతో అతనికే సంబంధాలు ఉన్నాయని అనిపిస్తోంది'' అని ఆరోపించారు.

వివరాలు 

లాలూ కుటుంబంపై తరచూ ఆరోపణలు 

సాధు, సుభాష్ యాదవ్‌లపై ఎన్డీయే కూటమి తరచుగా ఆరోపణలు చేస్తూ వచ్చింది. గతంలో లాలూ కుమార్తె మీసా భారతి వివాహ వేడుక కోసం పాట్నాలోని కార్ షోరూం నుంచి వాహనాలను బలవంతంగా తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి. 1999లో వాహనాలను దోచుకున్న విషయాన్ని సుభాష్ యాదవ్ అంగీకరించారు. ''ఆ సమయంలో లాలూ సూచన మేరకే ఆ దోపిడీ జరిగింది. నేను అడ్డుకునే ప్రయత్నం చేసినా, ఆయన అధికార మత్తులో ఎవరూ చెప్పినది వినే స్థితిలో లేడు'' అని అన్నారు.

వివరాలు 

తేజస్వీ యాదవ్‌పై వ్యాఖ్యలు 

తన మేనల్లుడు తేజస్వీ యాదవ్ గురించి మాట్లాడుతూ, ''ఆయన సీజనల్ రాజకీయ నాయకుడు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విశేష విజయాన్ని సాధిస్తుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో 200కు పైగా సీట్లు గెలుస్తాం'' అని జోస్యం చెప్పారు. ఈ ఆరోపణలపై ఆర్జేడీ ప్రతినిధి శక్తి యాదవ్ స్పందిస్తూ, ''మా నేతలపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించినా, అది బీహార్‌పై ఎలాంటి ప్రభావం చూపదు'' అని స్పష్టం చేశారు.