Rahul Gandhi: రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు ముందు రాహుల్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రతినిధి బృందాలు ప్రతిపక్ష నాయకుడిని కలవకుండా కేంద్రం కావాలనే అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు కొన్ని గంటల ముందే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్ ప్రాంగణం వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్, గతంలో విదేశీ ప్రతినిధులు భారతదేశానికి వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతను కలవడం పరిపాటిగా ఉండేదని గుర్తు చేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలోనూ,ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలోనూ ఈ పద్ధతి కొనసాగిందని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగా ఈ ఆనవాయితీని విస్మరించిందని విమర్శించారు.
వివరాలు
ప్రతిపక్షాల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి
"విదేశీ ప్రతినిధులతో మేము సమావేశం కావద్దని ప్రభుత్వం చెబుతోంది. వారిని ప్రతిపక్ష నాయకుడితో మాట్లాడవద్దని స్పష్టంగా సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన అస్థిరమైన మనస్తత్వం వల్లే ఈ విధంగా వ్యవహరిస్తోంది" అని రాహుల్ తెలిపారు. ఈ దేశానికి కేంద్ర ప్రభుత్వం మాత్రమే ప్రతినిధి కాదని, ప్రజల గొంతుకగా ప్రతిపక్షం కూడా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై ప్రతిపక్షాల అభిప్రాయాలకు కూడా గౌరవం ఇవ్వాలని రాహుల్ హితవు పలికారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, అలాగే విదేశాంగ శాఖ ఈ సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
వివరాలు
ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ సాయంత్రం భారత్‌కు రానున్నారు. ఆయన గౌరవార్థం ప్రధాని మోదీ విందును ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు జరగనున్నాయి. ఈ కీలక పర్యటన నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.