Loading...
Rahul Gandhi: 10 ఏళ్లలో 152 ప్రశ్నపత్రాల లీక్‌లు.. కేంద్రంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు
10 ఏళ్లలో 152 ప్రశ్నపత్రాల లీక్‌లు.. కేంద్రంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

Rahul Gandhi: 10 ఏళ్లలో 152 ప్రశ్నపత్రాల లీక్‌లు.. కేంద్రంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చివరి నిమిషంలో ప్రశ్నపత్రాల లీకేజీలు జరగడం వల్ల విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన అన్నారు. నీట్‌ పరీక్ష అవకతవకలపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్‌ పలు ఆరోపణలు చేశారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా 152 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు పారదర్శకమైన,నమ్మకమైన పరీక్షా విధానాన్ని కోరుకుంటున్నప్పటికీ, వారి సమస్యలను పరిష్కరించే బదులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై ప్రభుత్వం లాఠీఛార్జ్‌ చేయించిందని రాహుల్‌ ఆరోపించారు.

వివరాలు 

దేశ యువత ఉద్యోగాల కొరతతో ఇబ్బందులు పడుతోంది: రాహుల్

మరోవైపు మధ్యతరగతి కుటుంబాలకు విద్య ఖర్చు భారంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.

విద్య కోసం రూ.1.4లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ,పదేళ్లలో జరిగిన 152ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా సుమారు 7.50కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని తెలిపారు.

విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క నేరస్థుడికీ శిక్ష పడలేదని విమర్శించారు.

దేశ యువత ఉద్యోగాల కొరతతో ఇబ్బందులు పడుతోందని రాహుల్‌ అన్నారు.

విద్యార్థుల ఆశలు,ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వ విధానాలు దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.

దేశంలో చైనా ఉత్పత్తుల వినియోగం పెరుగుతుండగా,దేశీయ పరిశ్రమలు మూతపడుతున్నాయని చెప్పారు.

బ్యాంకులను కొందరు పెద్ద వ్యాపారవేత్తలు దోచుకుంటున్నారని,కృత్రిమ మేధ (ఏఐ)ప్రభావంతో కార్పొరేట్‌ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

విద్యార్థుల డిమాండ్లకు కాంగ్రెస్‌ మద్దతు

కేంద్ర విధానాల వల్ల పేదలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్యార్థులను శత్రువులుగా కాకుండా దేశ భవిష్యత్తుగా ప్రభుత్వం చూడాలని సూచించారు.

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని రాహుల్‌ విమర్శించారు.

ప్రశ్నపత్రాల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని యువత కోరుతోందని చెప్పారు.

ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జవాబుదారీతనం ప్రదర్శించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు.

నిరసనల్లో పాల్గొన్న యువతపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ వైఫల్యాలకు ప్రధాని క్షమాపణ చెప్పాలని విద్యార్థులు కోరుతున్నారని వెల్లడించారు.

ఈ అన్ని డిమాండ్లకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రజల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం

విద్యార్థుల ఆందోళనలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తమ ఉద్దేశం కాదని రాహుల్‌ గాంధీ తెలిపారు.

ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను వినిపించడం తన బాధ్యత అని చెప్పారు.

ఈ అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో విద్యార్థులకు మద్దతుగా వీధుల్లోకి రావాల్సి వచ్చిందని వివరించారు.

నిరసనల సందర్భంగా తనపై జరిగిన ఘటనను పెద్దగా పట్టించుకోవడం లేదని, అయితే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుండటమే తనను ఎక్కువగా బాధిస్తోందని అన్నారు.

పరీక్షల నిర్వహణ వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అవసరమని, ప్రజల కోసం ఎన్ని దెబ్బలైనా భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.

ADVERTISEMENT