Page Loader
RahulGandhi : రాహుల్‌ గాంధీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. ఆయనో ఎంపీ మాత్రమే,పెద్దనాయకుడేం కాదట
ఆయనో ఎంపీ మాత్రమే,పెద్దనాయకుడేం కాదట

RahulGandhi : రాహుల్‌ గాంధీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు.. ఆయనో ఎంపీ మాత్రమే,పెద్దనాయకుడేం కాదట

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jan 01, 2024
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన పెద్ద నాయకుడేమీ కాదని, ఆయనను హైలైట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది చోటా మోటా కాంగ్రెస్ నేత కాదు, ఏకంగా కాంగ్రెస్ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాహుల్‌ గాంధీ తమ కంటే గొప్పవాడేమీ కాదని,మీడియా ఆయనను కూడా తమలాగే సాధారణ ఎంపీగానే చూడాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత లక్ష్మణ్‌ సింగ్‌ అన్నారు. గుణ నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో రాహుల్‌ ప్రకటన చేసినప్పుడు టీవీల్లో ఆయనను మామూలుగానే చూపించారని అడిగిన ప్రశ్నకు లక్ష్మణ్‌ సింగ్‌ సమాధానమిచ్చారు.

Details

గత ఎన్నికల్లో ఓటమిపాలైన లక్ష్మణ్ సింగ్

రాహుల్‌ గాంధీ ఎంపీ మాత్రమేనని, ఆయన (పార్టీ) అధ్యక్షుడు కాదని, అన్నింటికి మించి కాంగ్రెస్‌ కార్యకర్త అన్నారు. అంతకుమించి ఏమీ లేదు. మీరు (మీడియా) రాహుల్ గాంధీని అంతగా హైలైట్ చేయకూడదు, మేము కూడా చేయకూడదని పేర్కొన్నారు. జన్మతః ఎవరూ గొప్పవారు కాదని రాహుల్ గాంధీని అంత పెద్ద నాయకుడిగా పరిగణించవద్దన్నారు. ఆయనో సాధారణ ఎంపీ, మీడియా ఆయనను హైలైట్ చేసినా, చేయకపోయినా పర్వాలేదన్నారు. లక్ష్మణ్ సింగ్ ఇప్పటికే ఐదుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తాను పార్టీ కార్యకర్తనని రాహుల్ గాంధే స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు.తామందరం పార్టీ కార్యకర్తలమని పునరుద్ఘాటించారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో చచౌరా స్థానం నుంచి పోటీ చేసిన లక్ష్మణ్ సింగ్ పరాజయం పాలయ్యారు.