Page Loader
మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్ అడ్డగింత.. ఎందుకో తెలుసా?
రాహుల్ గాంధీ కాన్వాయ్ ని అడ్డుకున్న పోలీసులు

మణిపూర్‌లో రాహుల్ గాంధీ కాన్వాయ్ అడ్డగింత.. ఎందుకో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2023
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

2 నెలలుగా అగ్ని గుండంలా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఇప్పటికీ శాంతి భద్రతలు అదుపులోకి రావడం లేదు. కుకీ, మెయితీ తెగల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే జాతుల మధ్య పోరులో అట్టుడికి పోతున్న మణిపూర్ వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం విఫలమైంది. కాన్వాయ్‌తో వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. చురాచాంద్ పుర్ జిల్లాకు పయనమైన ఆయన కాన్వాయ్ ను మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడం గమనార్హం. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ నేడు మణిపూర్ కు చేరుకున్నారు. చురాచాంద్ పూర్ శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలను, అక్కడి పౌర సమాజం నేతలతో రాహుల్ మాట్లాడనున్నారు.

Details

జాతుల మధ్య ఘర్షణలో 100 మంది మృతి

మైతేయ్‌లకు ఎస్టీ హోదాను వ్యతిరేకిస్తూ మే 3న నిర్వహించిన గిరిజన సంఘీభావ ర్యాలీ తీవ్ర ఘర్షణలకు దారి తీసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 శిబిరాల్లో 50వేల మంది ఆశ్రమం పొందుతున్నారు. భద్రతా కారణాల వల్ల ఇంఫాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపుర్ వద్ద కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాన్వాయ్ ని నిలిపివేశామని, చురాచాంద్ పుర్ కు రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్‌లో వెళ్లాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు. హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బిష్ణుపూర్ లో కాన్వాయ్ ని ఆపివేయమని రాహుల్ గాంధీని కోరినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.