బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌లకు అధికారం మాత్రమే కావాలి.. దాని కోసం మణిపూర్ను తగలబెడతారు : రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అధికారంపై మాత్రమే ఆసక్తి ఉంటుందని విమర్శించారు. దాని కోసం మణిపూర్ను తగులబెడతారని మండిపడ్డారు.
అది హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు,ఉత్తర్‌ప్రదేశ్ కావచ్చు, ఇదే క్రమంలో దేశం మొత్తాన్నీ తగలబెడతారని ఫైర్ అయ్యారు. వారు దేశ దుఃఖాన్ని, బాధను పట్టించుకోరని, అధికారం కోసం దేశం మొత్తాన్ని అమ్మేస్తారని తీవ్రంగా విమర్శించారు.
గురువారం యువజన కాంగ్రెస్ కార్యక్రమంలో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ మేరకు హాట్ కామెంట్స్ చేశారు.
DETAILS
బీజేపీ, ఆర్ఎస్ఎస్ హృదయంలో దేశమనే భావనే లేదు : రాహుల్ గాంధీ
అధికారంలో ఉన్నవారు ప్రజల సాధక బాధలను పట్టించుకోరని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశాన్ని ముక్కలు చేసే దిశగా పనిచేస్తున్నట్లు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారికి అధికారమే కావాలని, దానికోసం ఏదైనా చేస్తారని ఘాటుగా మాట్లాడారు. కాంగ్రెస్ యువజన విభాగం వారు దేశంపై ప్రేమ గలవారని, దేశం, పౌరులు బాధపడితే మీరూ బాధపడతారన్నారు.
కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ హృదయంలో దేశ భావనే లేదన్నారు. ఎందుకంటే వారు దేశాన్ని విభజించే పని మాత్రమే చేస్తారన్నారు.
జాతి ఘర్షణలతో నలిగిపోతున్న మణిపూర్ రాష్ట్రంలో పరిస్థితులపై ప్రధాన మంత్రి ప్రకటన చేయాలని ఇప్పటికే విపక్షాలు పట్టుబట్టాయి. ఆ అంశంపై పూర్తి స్థాయిలో చర్చలు జరగాలని ఇండియా ప్రతిపక్షాలు భీష్మించాయి.