దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు అండగా నిలవడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్‌కు అలవాటు: అమిత్ షా
అమెరికా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా కేంద్ర హోమమంత్రి అమిత్ షా రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతోన్న శక్తులకు అండగా నిలబడడం రాహుల్, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.
రాజకీయాలను ప్రాంతీయవాదం, మతం,భాషా పరంగా చీలికలు
అమిత్ షా మాట్లాడుతూ,"దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం,జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ఇవ్వడం,విదేశీ గడ్డపై భారత్ వ్యతిరేక ప్రకటనలు చేయడం ద్వారా.. ఆయన ప్రతిసారి దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు.కాంగ్రెస్ రాహుల్ గాంధీ ద్వారా రాజకీయాలను ప్రాంతీయవాదం, మతం,భాషా పరంగా చీలికలు తెస్తోంది.రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడడం ద్వారా కాంగ్రెస్ మరోసారి వ్యతిరేకతను వెల్లడించింది. బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు, దేశ భద్రతతో ఆటలాడలేరు"అని స్పష్టం చేశారు. అగ్రరాజ్య పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పలు ప్రసంగాలు, ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.
56 అంగుళాల ఛాతీ ఇక చరిత్రే
రిజర్వేషన్ల గురించి ఆయన వ్యాఖ్యానిస్తూ, భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలు సరైన ప్రాధాన్యం పొందడం లేదన్నారు. అభివృద్ధిలో వారి పాత్ర కూడా తక్కువ. నిష్పక్షపాత పరిస్థితులు వచ్చిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తాం అన్నారు. ఇక, "మీడియా, దర్యాప్తు ఏజెన్సీలతో ప్రజలను ఒత్తిడి చేయడం ద్వారా బీజేపీ, ప్రధాని మోదీ భయాన్ని వ్యాప్తి చేశారు. కానీ, ఎన్నికల తర్వాత అది మారిపోయింది. ఇప్పుడు బీజేపీను చూసి ఎవరూ భయపడట్లేదు. నేను పార్లమెంట్‌లో ప్రధాని ముందుకు వెళ్లి '56 అంగుళాల ఛాతీ ఇక చరిత్రే' అని చెప్పగలను" అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విదేశీ గడ్డపై రాహుల్ చేసిన వ్యాఖ్యల కారణంగా బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.