చైనా మ్యాప్‌పై ప్రధాని మోదీ మాట్లాడాల్సిందే: రాహుల్ గాంధీ
అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా పేర్కొంటూ.. ఆ దేశం మ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే చైనా విడుదల చేసిన మ్యాప్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా స్పందించారు. భారత భూభాగాలను కలుపుతూ.. చైనా మ్యాప్‌ను విడుదల చెయ్యడాని చాలా తీవ్రమైన సమస్యగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. భారత సరిహద్దు వెంబడి చైనా కార్యకలాపాలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లద్దాఖ్‌లో ఒక్క అంగుళం భూమిని కూడా చైనా స్వాధీనం చేసుకోలేదని ప్రధాని మోదీ చెబుతున్నారని, అయితే ఆ మాటలన్ని అబద్ధమని తాను చాలా సార్లు చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నారు.
చైనా మ్యాప్‌పై భారత్ ప్రభుత్వం అభ్యంతరం
లద్దాఖ్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని అక్కడి ప్రజలకు తెలుసునని రాహుల్ అన్నారు. అలాగే ప్రస్తుతం చైనా విడుదల చేసిన మ్యాప్ తీవ్రమైనదన్నారు. దీని గురించి ప్రధాని ఏదో ఒక విషయం చెప్పాలన్నారు. చైనాకు ఇలాంటి మ్యాప్‌లను విడుదల చేయడం అలవాటుగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. చైనా తమది కాని భూభాగాలను కలుపుకొని మాప్‌లను విడుదల చేయడం పరిపాటిగా మారిందన్నారు. చైనా మ్యాప్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు సరిహద్దు సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనా మ్యాప్‌ను తాము తిరస్కరిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరిందమ్ బాగ్చి చెప్పారు.