ఒకవైపు గాంధీ, మరోవైపు గాడ్సే: బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేతో పోల్చారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో జరిగిన 'జన్ ఆక్రోశ్' ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇది సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ఆరెస్సెస్, బీజేపీ ఉన్నాయన్నారు. అలాగే ఒకవైపు మహాత్మాగాంధీ, మరోవైపు గాడ్సే ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తారని, మధ్యప్రదేశ్ రైతులు, యువత వారిని అసహ్యించుకోవడం ప్రారంభించారన్నారు.
అవినీతికి కేంద్రంగా మధ్యప్రదేశ్: రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్రలో తాను మధ్యప్రదేశ్‌లో పలువురు రైతులు, మహిళలు, యువకులను కలిసినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వారు తనకు నాకు కొన్ని విషయాలు చెప్పారన్నారు. రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర లభించడం లేదని తనతో చెప్పినట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అవకతవకలకు పాల్పడుతోందన్నారు. దేశంలో అవినీతికి కేంద్రంగా రాష్ట్రం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 18,000మంది రైతుల మరణానికి దారితీసిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుల గణన నిర్వహిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.