'ఇండియా' కూటమికి భయపడి పేరు మార్చుతున్నారు : రాహుల్ గాంధీ
ఇండియా వర్సెస్ భారత్ అంశం గత కొద్ది రోజులుగా భారతదేశంలో దుమారం రేపుతోంది. ఈ మేరకు కేంద్రం తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడం వల్లే భారత ప్రభుత్వం ఏకంగా దేశం పేరునే మార్చేందుకు పూనుకుందన్నారు. రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే రెండు పదాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ రెండు పదాలు సరైనవేనన్నారు. ప్యారిస్‌లోని సైన్సెస్ పీఓ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశాన్ని ఇండియా లేదా భారత్ అనే రెండు పేర్లతో పిలవడం ఆమోదయోగ్యమేనన్నారు. కానీ ఇక్కడ పేరు మార్పు వెనుక ఉన్న ఉద్దేశాలే కీలకమన్నారు.
మైనారిటీలను బీజేపీ, ఆరెస్సెస్‌లు అణిచివేస్తున్నాయి : రాహుల్
భారత ఆత్మపై దాడి చేస్తున్న వారు తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. విపక్షాల కూటమి పేరును చూసి కేంద్రం అసహనానికి గురవుతోందని రాహుల్ ఎద్దేవా చేశారు. కూటమి పేరు ఇండియాగా ఉండటంతో కాషాయ పాలకులు దేశం పేరు మార్చేందుకు నిర్ణయించారన్నారు. దేశవ్యాప్తంగా మైనారిటీలను బీజేపీ, ఆరెస్సెస్‌లు అణిచివేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. ఈ మేరకు అడ్డుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. స్వదేశంలోనే మైనారిటీలు అభ్రదతాభావంతో బతకడం దేశానికే సిగ్గుచేటన్నారు. దేశం పేరును మార్చేందుకు ప్రయత్నిస్తున్న వారు చరిత్రను నిరాకరిస్తున్నారని, ఈ మేరకు వారు చేస్తున్న కార్యాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.