
Rahul Gandhi: కుల వివక్షను అంతం చేయడానికి రోహిత్ వేముల చట్టం తీసుకురండి: కర్ణాటక ముఖ్యమంత్రిని కోరిన రాహుల్
ఈ వార్తాకథనం ఏంటి
విద్యావ్యవస్థలో ఇప్పటికీ బలహీన వర్గాలపై కుల వివక్ష కొనసాగుతూనే ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న దళిత విద్యార్థులను కాపాడేందుకు ప్రత్యేక చట్టం అవసరమని అభిప్రాయపడ్డారు.
'రోహిత్ వేముల చట్టం'ను రూపొందించి అమలులోకి తేవాలంటూ, ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆయన లేఖ రాశారు.
నేటికీ దేశవ్యాప్తంగా లక్షలాదిమంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలకు చెందిన విద్యార్థులు వివక్షను ఎదుర్కొంటున్నారని, ఇది దేశానికి సిగ్గుచేటని రాహుల్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
సిద్ధరామయ్య ఈ దిశగా చర్యలు తీసుకుంటారని నముతున్న: రాహుల్
రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్షను రాహుల్ ఈ లేఖలో ప్రస్తావించారు.
అంబేడ్కర్ మాదిరిగానే ఇకపై మరెవ్వరూ అలాంటి పరిస్థితులను ఎదుర్కోకూడదన్న ఆలోచనతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ దిశగా చర్యలు తీసుకుంటారని తన నమ్మకమని రాహుల్ పేర్కొన్నారు.
ఇటువంటి వివక్ష కారణంగానే రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకిలాంటి యువతీ యువకులు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారని గుర్తుచేశారు.
మంచి భవిష్యత్తు గల యువత ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరమని, ఇకపై ఈ తరహా ఘటనలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
రోహిత్ ఆత్మహత్య.. ఎనిమిదేళ్ల తరువాత కేసుపై మళ్లీ విచారణ
2016 జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిగా చదువుతున్న రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
అతను చనిపోయేందుకు విద్యాసంస్థలోని అధికారులు, కొంతమంది విద్యార్థుల అసహనమే కారణమంటూ దేశవ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాయి.
దళిత విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టం అవసరమని డిమాండ్ చేశారు.
ఇప్పుడు, రోహిత్ ఆత్మహత్యకు ఎనిమిదేళ్ల తరువాత, ఆయన తల్లి విజ్ఞప్తి మేరకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం పునర్విచారణకు ముందుకొచ్చింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుపై మళ్లీ విచారణ ప్రారంభించడం విశేషం.