LOADING...
Kazipet rail Coach Factory: 2026 మార్చి నుంచి కాజీపేటలో కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
మార్చి నుంచి కాజీపేటలో కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

Kazipet rail Coach Factory: 2026 మార్చి నుంచి కాజీపేటలో కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 10, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌లో 2026 మార్చి నుంచి రైలు కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి నెల 50 కోచ్‌లు ఉత్పత్తి చేసి, సంవత్సరానికి మొత్తం 600 ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో కోచ్‌లు, వ్యాగన్ల తయారీ, మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.716 కోట్లు వెచ్చించిందని వివరించారు. ఇప్పటివరకు 65% పనులు పూర్తయ్యాయని, దాదాపు రూ.360 కోట్ల నిధులు ఖర్చయినట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

వివరాలు 

ఇంజిన్ అవసరం లేని ఈఎంయూలు 

'కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నఈ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ దేశవ్యాప్తంగా రైలు కోచ్‌ల తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా,వరంగల్ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది.ఇక్కడ ఆధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో పాటు ఇంజిన్ ప్రత్యేకంగా అవసరం లేని ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు (ఈఎంయూ)కూడా ఉత్పత్తి చేయబడతాయి.నెలకు రెండు ఈఎంయూలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం,ఒక్కో యూనిట్‌లో 12 బోగీలు ఉంటాయి.ఎంఎంటీఎస్,మెట్రో రైళ్లు కూడా ఇవే తరహా ఈఎంయూలకు చెందినవే. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు, ఈఎంయూలతో పాటు గూడ్స్ రైళ్ల వ్యాగన్లు కూడా ఉత్పత్తి చేయబడతాయి. ఏడాదికి 2,400 వ్యాగన్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. 160 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ యూనిట్‌లో 60,753 చ.మీ. విస్తీర్ణంలో ప్రీఇంజినీర్డ్ భవనాలు ఏర్పాటు చేయనున్నాం' అని కేంద్ర మంత్రి వివరించారు.