ఒడిశా రైలు ఘటనలో ఉన్నతాధికారులపై రైల్వేశాఖ సీరియస్.. ఐదుగురిపై వేటు
ఒడిశా ఘోర రైలు ప్రమాదంపై ఇప్పటికే సీబీఐ విచారణ కోరిన రైల్వేశాఖ, తాజాగా బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. ఘటన జరిగిన 3 వారాల అనంతరం రైల్వే ఆఫీసర్స్ పై వేటు వేసింది. సౌత్ ఈస్టర్న్ రైల్వేస్‌కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులపై రైల్వే బోర్డు కొరడా ఝులింపించింది. సిగ్నలింగ్, ఆపరేషన్స్, సేఫ్టీ విభాగాలను నిర్వహించే అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా ఘటన, ఇండియన్ రైల్వే చరిత్రలోనే అత్యంత భారీ ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈనెల 2న బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో 3 రైళ్లు ఢీకొన్న ఘటనలో వందలాది ప్రాణాలు పోయాయి. దాదాపు 292 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోగా, 1,100 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే.
ఉన్నతాధికారులపై బదిలీ వేటు
ఐదుగురు ఉన్నతాధికారులపై వేటు 1. ఖరగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ శుజాత్ హష్మీ 2. ఎస్‌ఈఆర్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ పీఎం సిక్దర్ 3. ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ చందన్ అధికారి 4. ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ డీబీ కేసర్ 5. ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎండీ ఓవైసీపై బోర్డ్ చర్యలు తీసుకుంది. ఈ బదిలీలు జరగకముందే సౌత్ ఈస్టర్న్ రైల్వేస్‌కి చెందిన జోన్ అడిషనల్ జనరల్ మేనేజర్ అతుల్య సిన్హా పైన వేటు పడింది. ఆయన్ను అక్కడ్నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.