Cloud kitchens: రైళ్లలో ఆహార నాణ్యతపై రైల్వే శాఖ కీలక నిర్ణయం: అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు
రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల్లో ఆహారానికి సంబంధించిన ఫోటోలు కూడా తరచుగా వైరల్ అవుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో అందించే ఆహారం కోసం బేస్ కిచెన్లకు స్వస్తి చెబుతూ, క్లౌడ్ కిచెన్ల సేవలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు రైల్వే స్టేషన్లలో బేస్ కిచెన్ల ద్వారా వండిన ఆహారాన్ని ప్యాక్ చేసి ప్రయాణికులకు అందించేవారు. కానీ అపరిశుభ్రత, నాసిరకం ఆహార నాణ్యతపై అనేక ఫిర్యాదులొచ్చాయి.
ముంబయిలో క్లౌడ్ కిచెన్ల సేవలు
ఐఆర్‌సీటీసీ కొత్త ప్రణాళికతో క్లౌడ్ కిచెన్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ క్లౌడ్ కిచెన్లను నిపుణుల సహకారంతో నడిపి, ప్రయాణికులకు మెరుగైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ముంబైలో క్లౌడ్ కిచెన్ల సేవలు ప్రారంభమయ్యాయి. పోవై, కుర్లా, పన్వెల్, థానే, చెంబూర్ ప్రాంతాల్లో ఈ సేవలు నెలరోజుల కిందటే ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో దాదాపు 200 క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి.
రాబోయే మూడు నెలల్లో 200 కిచెన్లు
ముంబయిలో ప్రస్తుతం 50 కిచెన్లు పని చేస్తున్నాయని, ఇంకా 90 కిచెన్లు నిర్మాణంలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాబోయే మూడు నెలల్లో మొత్తం 200 కిచెన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. క్లౌడ్ కిచెన్లలో సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆహార తయారీపై కఠిన నియంత్రణ విధించనున్నారు. ఈ కొత్త విధానంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించగలమని రైల్వే బోర్డు నమ్మకంగా ఉంది.