Page Loader
Delhi : రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా 
రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Delhi : రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 16, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో శనివారం న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడినట్లు అధికారిక సమాచారం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను రైల్వేశాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పగాయాలపాలైనవారికి రూ.1 లక్ష సాయం అందించనున్నట్లు వెల్లడించారు. మృతుల్లో బిహార్‌కు చెందిన 9 మంది, దిల్లీకి చెందిన 8 మంది, హరియాణాకు చెందిన ఒకరు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

Detail

రాష్ట్రపతి, ప్రధాని స్పందన 

రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Details

 తొక్కిసలాటకు కారణాలు 

కుంభమేళా కోసం వేలాదిగా భక్తులు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. 14వ నంబర్ ప్లాట్‌ఫాం వద్ద ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచివుండగా, భక్తులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆలస్యమైన కారణంగా ప్రయాణికులు 12, 13, 14వ ప్లాట్‌ఫాంలలో భారీగా కిక్కిరిసిపోయారు. ఈ రద్దీ ఒక్కసారిగా తీవ్రంగా మారి తొక్కిసలాటకు దారితీసింది.