
Railway Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు
ఈ వార్తాకథనం ఏంటి
2024 నవంబర్ నుండి ప్రారంభమైన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల(ఆర్‌ఆర్‌బీ)నియామక ప్రక్రియలో 55197 ఖాళీలకు సంబంధించిన ఏడు వేర్వేరు నోటిఫికేషన్ల కోసం 1.86 కోట్లకు పైగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) నిర్వహించాయి. ఈ ప్రక్రియతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50,000కు పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడమే కాదు,ఇప్పటికే మొదటి త్రైమాసికంలో 9,000కంటే ఎక్కువ నియామక పత్రాలను ఆర్‌ఆర్‌బీలు పంపిణీ చేశాయి. ఆర్‌ఆర్‌బీ పరీక్షల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించడం అనేది ప్రణాళిక, సమన్వయంతో కూడుకున్న పెద్ద పని. అభ్యర్థులకు వారి నివాస ప్రాంతాల సమీపంలో పరీక్షా కేంద్రాలను కేటాయించడం,ప్రత్యేకంగా మహిళలు,దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆర్‌ఆర్‌బీలు ఇటీవల నిర్ణయించాయి.
వివరాలు
1,08,324 ఖాళీలకు సంబంధించి మొత్తం 12 నోటిఫికేషన్లు
ఈ దిశగా పూర్తిస్థాయిలో పారదర్శకత ఉండేందుకు,ఎవరికీ అన్యాయం జరగకుండా పరీక్షల నిర్వహణకు మరిన్ని పరీక్షా కేంద్రాల అవసరం ఏర్పడుతుంది. అదనంగా, మానవ వనరుల సమీకరణ కూడా అవసరమవుతుంది. ఆర్‌ఆర్‌బీలు విడుదల చేసిన వార్షిక క్యాలెండర్ ప్రకారం,2024 నుంచి 1,08,324 ఖాళీలకు సంబంధించి మొత్తం 12 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరంలో 50,000కంటే ఎక్కువ నియామకాలను చేపట్టే యోచనలో ఉన్నాయి. ఈసారి పరీక్షల నిష్పాక్షికతను మెరుగుపర్చే లక్ష్యంతో, అభ్యర్థుల గుర్తింపులో ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. ఇది 95 శాతం మందికి పైగా విజయవంతంగా అమలైంది. అలాగే, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మోసం చేసే అవకాశాన్ని పూర్తిగా నివారించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల్లో 100 శాతం జామర్‌లు వినియోగిస్తున్నారు.